బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న రకుల్ ప్రీత్‌సింగ్ మీడియాపై గుర్రుమంటోంది. తనపై వార్తలు రాయొద్దు అని ఆమె కోర్టుకు ఎక్కింది. తన పైన మీడియాలో వస్తున్న కథనాలను ఆపాలని.. దీంతో తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లుతోందని మరోసారి కోర్టును ఆశ్రయించింది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా క్రచవర్తి డ్రగ్స్ సప్లై చేసినట్టు తేలడంతో రకుల్‌ను ఎన్సీబీ అధికారులు విచారించారు. రియా, శ్రద్ధా కపూర్, దీపికా పదుకునే, సారా అలీఖాన్, రకుల్‌ల పేర్లను బయటపెట్టింది. దీంతో వారు విచారణకు హాజరు అవ్వాలని ఎన్సీబీ అధికారులు ఆదేశించారు. ఎన్సీబీ అధికారుల విచారణకు వీరు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో గతంలో డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న మీడియా కథనాలను నిలిపివేయాలంటూ రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మీడియాలో తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో కోరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై మరోసారి రకుల్ ముంబైలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డ్రగ్స్ కేసులో మీడియాలో తనపై వస్తున్న కథనాలు తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొంది. మీడియా కథనాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఎన్సీబీ డ్రగ్స్ కేసు దర్యాప్తును పూర్తి చేసి సంబంధిత కోర్టు ముందు నివేదికను దాఖలు చేసేవరకు మీడియా కథనాలను కట్టడి చేసేలా మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలని కోరింది. ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీచేసింది.