డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్

May 27, 2022

ముంబయి క్రూజ్‌షిప్ డ్రగ్స్ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జ్‌షీట్‌ సమర్పించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. అతనికి డ్రగ్స్తో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు రిజిస్ట్రీకి సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఎన్సీబీ తెలిపింది. ఆర్యన్ ఖాన్ అమాయకుడని.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో మరో ఐదుగురికి సంబంధించి కూడా తగిన సాక్ష్యాలు దొరకలేదని ఎన్సీబీ తెలిపింది. ఈ డ్రగ్స్ కేసును మొదట ఎన్సీబీ ముంబయి జోన్ అధికారులు విచారించారు. ఆ తర్వాత ఎన్సీబీ ఢిల్లీ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును తమ చేతుల్లోకి తీసుకుంది.

డ్రగ్స్‌ కలిగి ఉన్నారనే ఆరోపణలపై గతేడాది 2021 అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ముంబయి నగర శివారులోని తీరప్రాంతంలో క్రూజ్‌ నౌకలో రేవ్ పార్టీ నిర్వహించారని , ఈ పార్టీకి షారుక్ కొడుకు ఆర్యన్‌తోపాటు మరికొందరు హాజరైనట్లు నార్కటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఆర్యన్‌తో సహా పలువురిని అరెస్ట్‌ చేశారు. ఈ దాడులకు అప్పటి ఎన్సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వం వహించారు. ఆ తర్వాత ఈ ఘటన రాజకీయ దుమారానికి దారి తీసింది. తొలుత ఆర్యన్ ఖాన్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు, ఆ తర్వాత కొద్ది రోజులకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 19 మందిలో 17మందికి ఇప్పటికే బెయిల్ లభించింది.