దేశవ్యాప్తంగా ఉన్న బీఈడీ, డీఈడీ, వ్యాయామ విద్య కోర్సులను అందించే ఉపాధ్యాయ విద్య కాలేజీలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) తీవ్రంగా మండిపడింది. సుమారు 6 వేల కాలేజీలపై ఆంక్షలు విధించింది. వచ్చే విద్యా సంవత్సరం (2022-23)లో ప్రవేశాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. భారత్లో మొత్తం 17 వేల ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు బీఈడీ, డీఈడీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కాలేజీలు 2022 ఏప్రిల్ 2వ తేదీ వరకు ప్రతి కళాశాల పనితీరు అంచనా నివేదిక (పెర్ఫార్మెన్స్ అప్రెజల్ రిపోర్ట్-పార్)ను అప్లోడ్ చేయాలంటూ తుది గడువును నిర్ణయించింది. ఎన్సీటీఈ నిర్ణయించిన గడువులోపు కేవలం 10,999 కళాశాలలు మాత్రమే సమర్పించాయి. నివేదిక సమర్పించని వాటిపై ఎన్సీటీఈ చర్యలు మొదలుపెట్టింది.
ఇక, తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణలో ప్రస్తుతం 206 బీఈడీ, 109 డీఈడీ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 271 మాత్రమే నివేదికలను సమర్పించాయి. అంటే మిగిలిన 44 కళాశాలల్లో జీరో ఇయర్ అయినట్లేనని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 521 బీఈడీ, డీఈడీ కళాశాలలున్నాయి. వాటిలో 403 కళాశాలలు మాత్రమే “పార్ నివేదికను అప్ లోడ్ చేయడంతో 118 కళాశాలల్లో వచ్చే కొత్త విద్యాసంవత్సరంలో ప్రవేశాలు జరపడానికి వీల్లేదు. ఇక కాకతీయ వర్సిటీలో బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులు, ఓయూలో ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిలిచిపోనున్నాయి.