ఎన్డీ తివారీ కన్నుమూత.. పుట్టినరోజే చివరిరోజు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్డీ తివారీ కన్నుమూత.. పుట్టినరోజే చివరిరోజు..

October 18, 2018

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ(93)  ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.

tt

తివారీ 1925, అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలోని బలూటి గ్రామంలో పుట్టారు. అసలు పేరు నారాయణన్‌ దత్‌ తివారీ. ఆయన మొదట్లో ప్రజా సోషలిస్ట్‌ పార్టీలో పనిచేసి అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.మూడు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా (1976-77, 1984-85, 1988-89)  పనిచేశారు. 1994లో అర్జున్ సింగ్‌తో కలిసి ఆలిండియా ఇందిరా కాంగ్రెస్ పార్టీ(తివారీ) స్థాపించారు. అయితే మరుసటి ఏడు మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2002 నుంచి 2007 వరకూ ఉత్తరాఖండ్‌ సీఎంగా సేవలందించారు. తివారీకి ఇందిర, రాజీవ్‌ గాంధీ వంటి అగ్రనేతలో సాన్నిహిత్యం ఉండేది. ఆయన రాజీవ్ కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.  తివారీ 2007 నుంచి 2009 వరకు ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా పనిచేశారు.

yyt


రాజ్ భవన్లో లైంగిక వివాదం..

ఎన్డీ తివారీ ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా ఉన్నప్పుడు లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజ్‌భవన్‌లో ఆయన పలువురు మహిళలతో రాసలీలలు సాగించినట్లు మీడియా బయటపెట్టడంతో రాజీనామా చేశారు. తర్వాత పితృత్వ కేసును కూడా చాన్నాళ్లపాటు ఎదుర్కొన్నారు. తివారీ తన తండ్రి అంటూ రోహిత్‌ శేఖర్‌ తివారీ అనే యువకుడు కోర్టుకెక్కాడు. మొదట్లో కాదని వాదించిన ఎన్డీ తివారీ  తర్వాత వెనక్కి తగ్గారు. కోర్టు డీఎన్‌ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్‌.. ఎన్డీ తివారీ కొడుకేనని తేలింది. దీంతో రోహిత్‌ శేఖర్‌ను తన కొడుకుగా అంగీకరించి, 2014 మేలో అతని తల్లి ఉజ్వలను పెళ్లి చేసుకున్నారు. రోహిత్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.