కోవిందుడు అందరి వాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

కోవిందుడు అందరి వాడు..!

July 4, 2017

ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు తెలుగురాష్ట్రాల్లో ఘనస్వాగతం లభించింది. ఆయన విక్టరీ తథ్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. త‌న పేరును ప్ర‌క‌టించ‌క‌ముందే టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తు తెలపడం సంతోష‌క‌రమ‌న్న రామ్ నాథ్..రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌నిచేస్తానని స్పష్టం చేశారు.

ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తును సీఎం కేసీఆర్‌ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లోని జ‌ల‌విహార్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంంలో ఆయ‌న ప్రసంగించారు. రామ్‌నాథ్‌ను సీఎం కేసీఆర్ శాలువ క‌ప్పి, పుష్ఫ‌గుచ్ఛం ఇచ్చి స‌న్మానించారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో రామ్‌నాథ్‌కు భారీ విజ‌యం ద‌క్కుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం భ‌విష్య‌త్తులో త‌న ప్ర‌గ‌తి కోసం మీ ఆశీస్సులు కోరుకుంటుంద‌న్నారు. దేశాన్ని ఆర్థిక వృద్ధి దిశ‌గా తీసుకెళ్లుతున్న ప్ర‌ధాని మోదీకి త‌మ‌ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుద‌ని కేసీఆర్ అన్నారు.”తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు ఉండేవి. క‌రెంటు క‌ష్టాలు తీవ్రంగా ఉండేవి, ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. ఇవాళ తెలంగాణ ప‌వ‌ర్ స‌ర్‌ప్ల‌స్ రాష్ట్రంగా మారింది. త‌క్కువ స‌మ‌యంలోనే రాష్ట్రాన్ని అగ్ర‌ప‌థాన నిలిపాం. ఆర్థిక వృద్ధిలోనూ తెలంగాణ ప్ర‌థ‌మంగా ఉంది. రెండేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి మొద‌టి ర్యాంక్ వ‌స్తోంది” అని సీఎం కేసీఆర్ అన్నారు.

ప్రెసిడెన్సీ ఆఫీసు రాజ‌కీయాల‌కు అతీతం అని ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గ‌వ‌ర్న‌ర్‌గా రాజీనామా చేసిన త‌ర్వాత కూడా తాను ఎటువంటి రాజ‌కీయ పార్టీలో చేర‌లేద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్‌గా ఏ పార్టీతోనే అనుబంధం పెట్టుకుని ప‌నిచేయలేద‌ని స్పష్టం చేశారు రాష్ట్ర‌ప‌తిగా కూడా రాజ‌కీయాల‌కు అతీతంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తాన‌ని కోవింద్ చెప్పారు. రాజ్యాంగ‌మే త‌న‌కు ముఖ్య‌మని, దేశాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఎన్డీఏ, ఎన్డీయేత‌ర పార్టీలు త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజ‌కీయ పార్టీల‌తో సంబంధం లేకుండా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు రామ్‌నాథ్ తెలిపారు.

ఆ తర్వాత రామ్ నాథ్ కోవింద్ కు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా వీడ్కోలు పలికారు. కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలు పాల్గొన్నారు. బేగంపేట నుంచి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు.