ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా..ఒడిశా టీచరమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా..ఒడిశా టీచరమ్మ

June 22, 2022

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇటు అధికార పార్టీ నాయకులు అటు విపక్షాల నాయకులు గతకొన్ని రోజులుగా చర్చోపచర్చలు జరిపి మంగళవారం రాష్ట్రపతి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ పలువురు నాయకులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, సుమారు 20 పేర్లు తెరపైకి రాగా, ఈసారి దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ద్రౌపదీ ముర్మూను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భేటీ అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ..” ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అగ్రవర్ణాలు, ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గానికి చెందినవారు చేపట్టారు. కానీ, ఎస్టీలు రైసినా హిల్ మెట్లు ఎక్కలేదు. దేశ అత్యున్నత పదవిని అప్పగించిన గౌరవం బీజేపీకి దక్కుతుంది” అని ఆయన అన్నారు.

ద్రౌపదీ ముర్మూ.. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూరభంజ్ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించారు. బీఏ పూర్తి చేసి, నీటి పారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, అసిస్టెంట్ టీచర్‌గా విధులు నిర్వహించారు. 1997లో బీజేపీ చేరారు. ఆరోజు నుంచి బడిశాలో పలు శాఖలకు మంత్రిగా ఎన్నికైయ్యారు. 2015లో జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. ద్రౌపదీ ముర్మూ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్న వారంతా 1947కి ముందు పుట్టినవారే. సంతాల్ గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో బీజేపీ, బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు.