భారత్‌లో 50 వేల చేరువలో యాక్టివ్ కేసులు..నిన్న ఒక్కరోజే.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో 50 వేల చేరువలో యాక్టివ్ కేసులు..నిన్న ఒక్కరోజే..

June 13, 2022

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతుంది. గతకొన్ని నెలలుగా తగ్గినట్లే తగ్గి, మళ్లీ విజృంభిస్తుంది. రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనకు గురౌతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బుల్‌టెన్ ప్రకారం..”గత 24 గంటల్లో 8,084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,592 మంది కోలుకున్నారు. 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 47,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,30,101కి చేరాయి. 4,26,57,335 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,24,771 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 98.68 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశాం. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు” అని వెల్లడించారు.

మరోవైపు గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల విషయానికొస్తే.. అత్యధికంగా కేరళలో 4,309 కేసులు, మహారాష్ట్రలో 2,946 కేసులు, కర్నాటకలో 463 కేసులు, హర్యానాలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక, కరోనా పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైయ్యాయి. ప్రజలు ఎక్కడికి ప్రయాణం చేసినా, పనికెళ్లిన, షాపింగ్ మాల్స్‌కు వెళ్లిన మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాస్కు ధరించకపోతే భారీ జారిమానాను విధిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతున్న సంధర్భంగా వైద్యులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదని, మాస్కు, శానిటైజర్, భౌతికదూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.