"Need To Protect Her Life, Liberty": Supreme Court Relief For Nupur Sharma
mictv telugu

నుపుర్ శర్మకు స్వల్ప ఊరట.. అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం వ్యాఖ్యలు

July 19, 2022

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శ‌ర్మ‌కు ఎట్ట‌కేల‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం ఊర‌ట ల‌భించింది. ఆమెపై నమోదైన పలు కేసుల్లో ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా సుప్రీం రక్షణ కల్పించింది. నుపుర్ శ‌ర్మ‌పై ఆగ‌స్టు 10 వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌రాదంటూ సుప్రీంకోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతేకాకుండా నుపుర్ శ‌ర్మ‌కు ప్రాణ హాని ఉందంటూ కూడా సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య చేసింది.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కేసులో త‌న‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సోమ‌వారం నుపుర్ శ‌ర్మ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా త‌న‌కు ప‌లు వ‌ర్గాల నుంచి ప్రాణ హాని ఉంద‌ని కూడా ఆమె కోర్టుకు తెలిపారు. దేశ‌వ్యాప్తంగా త‌న‌పై న‌మోదైన అన్ని కేసుల‌ను ఒకే కేసుగా మార్చాల‌ని కూడా ఆమె కోర్టును కోరారు. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ చేప‌ట్టిన కోర్టు నుపుర్ శ‌ర్మ‌కు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. జులై 1వ తేదీన ఇదే ధర్మాసనం నుపుర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లోకి నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని పేర్కొంది. తాను చేసిన వ్యాఖ్యలకు దేశం మొత్తానికి ఆమె క్షమాపణలు చెప్పాలని వ్యాఖ్యానించింది.