Neeraj Chopra scripts history, wins silver in World Athletics Championships 2022
mictv telugu

విశ్వవేదికపై మరోసారి సత్తా చాటిన నీరజ్ చోప్రా.. ప్రధాని ట్వీట్

July 24, 2022

 

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా రజతం గెలుచుకున్నాడు. జావెలిన్‌ త్రోలో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకున్నాడు. అండర్సన్‌ పీటర్స్‌(గ్రెనెడా) 90.54 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన నీరజ్.. తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఐదో ప్రయత్నంలోనూ నీరజ్ ఫౌల్ చేశాడు. వద్లెచ్ 88.09 మీటర్ల దూరం బల్లెం విసిరి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ ఆకట్టుకోలేకపోయాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్గా, పురుషుల విభాగంలో తొలి భారత ఆటగాడిగా నిలిచాడు నీరజ్ చోప్రా. 2003లో పారిస్ వేదికగా జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో లాంగ్ జంప్ విభాగంలో కాంస్యం గెల్చుకుంది అంజు బాబి జార్జ్. ఇప్పుడు నీరజ్ ఆమె కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది జపాన్ టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో భారత్ గర్వపడేలా చేశాడు నీరజ్. ఒలింపిక్స్లో స్వర్ణం దక్కించుకున్న భారత తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన రెండో భారత ఆటగాడిగానూ నిలిచాడు.

ప్రధాని మోదీ అభినందనలు

రజత పతకం గెల్చిన నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చరిత్ర సృష్టించిన నీరజ్ను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. క్రీడల్లో భారత్కు ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు. రానున్న టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు మోదీ. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సహా పలువురు ప్రముఖులు నీరజ్కు అభినందనలు తెలిపారు.