రేపే నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష.. ఈ నెలలోనే ఫలితాలు - MicTv.in - Telugu News
mictv telugu

రేపే నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష.. ఈ నెలలోనే ఫలితాలు

March 4, 2023

NEET entrance exam will be held in 10 centers in Telangana on Sunday

 

దేశవ్యాప్తంగా 2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) మెడికల్‌ సీట్ల భర్తీకి ఆదివారం నీట్‌ ప్రవేశపరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2,453 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య విద్యాసంస్థల్లో 1,393, ప్రైవేటులో 1,060 సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

NEET entrance exam will be held in 10 centers in Telangana on Sunday

 

మార్చి 31వ తేదీలోపు ఫలితాలను వెల్లడించనున్నారు. దిల్లీ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్‌, చండీగఢ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, పుదుచ్చేరిలోని జిప్‌మెర్‌, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌, త్రివేండ్రంలోని చిత్ర తిరునాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థల్లో అడ్మిషన్లకు నీట్‌ ప్రవేశ పరీక్ష వర్తించదు.

అంతకుముందు నీట్ పీజీ 2023ని వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ పరీక్షను మార్చి 5న నిర్వహించబోతుండగా.. కొందరు విద్యార్థులు పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మరో 2-3 నెలలు పొడిగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నీట్ పీజీ పరీక్ష సకాలంలో నిర్వహించబడుతుందని తెలిపింది. నీట్ పీజీ 2023 కోసం దాదాపు 2.09 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.