NEET exam row explained: Centre orders probe even as NTA cries foul
mictv telugu

నీట్ ‘లో దుస్తుల’ వివాదం.. కొట్టి పారేసిన ఎన్టీఏ

July 19, 2022

నీట్ ఎగ్జామ్ సందర్భంగా కేరళలోని ఓ పరీక్షా కేంద్రంలో బాలికలను లో దుస్తుల తొలగించమన్నారనే వివాదం రాజుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా కేరళలో సోమవారం నీట్ ఎగ్జామ్ జరిగింది. ఈ సందర్భంగా కొల్లాంలోని ఓ పరీక్షా కేంద్రంలో లో దుస్తులు తొలగించిన తర్వాతే పరీక్ష రాసేందుకు అమ్మాయిలకు అనుమతి ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని ఓ విద్యార్థిని తండ్రి మీడియా ద్వారా వెల్లడించారు. సిబ్బంది అవమానకరంగా వ్యవహరించారని వాపోయారు.

దీనిపై నీట్‌ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పందించింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలపై వెంటనే పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, స్వతంత్ర పరిశీలకుడు, సిటీ కోర్డినేటర్ నుంచి వివరణ తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంది. ‘పరీక్షా సమయంలో కానీ, తర్వాత కానీ ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నీట్ పరీక్ష విషయానికొస్తే.. తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన తరహాలో ఎలాంటి చర్యలను ఎన్‌టీఏ అనుమతించదు. వివిధ వర్గాల సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ పరీక్షలను నిర్వహిస్తాం’ అని ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది. మరోపక్క ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఉద్దేశపూర్వకంగా చేసినవని, పరీక్షా కేంద్రంలో ఆ తరహా ఘటన ఏదీ జరగలేదని కొల్లాం జిల్లా కోఆర్డినేటర్, పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌ వెల్లడించారు.