ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడింది. టాపర్‌గా నిలిచిన వ్యక్తిని ఫెయిల్ అంటూ ప్రకటించి, ఆ తర్వాత తప్పిదాన్ని అధికారులు గ్రహించారు. 650 మార్కులు వచ్చినా కూడా 329 అంటూ ప్రకటించడంతో ముందు అతడు అర్హత సాధించలేకపోయాడు. ఆ తర్వాత మరోసారి సరిచూడటంతో ఎస్టీ కేటగిరిలో టాపర్‌గా నిలిచాడు. జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. దీంతో నిర్వాహకుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్తాన్‌కు చెందిన రావత్ అనే విద్యార్థికి ఈ నెల 16 న, వచ్చిన నీట్ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఫెయిల్ అని వచ్చింది. అప్పటికే అతడికి అనుమానం రావడంతో కీ చెక్ చేసుకున్నాడు. 720 మార్కులకు గానూ 650 మార్కులు వచ్చాయి. వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రీ వెరిఫికేషన్ చేశారు. ఆనర్సర్ కీ, ఓఎంఆర్ షీట్ తనిఖీలు చేయగా ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్‌గా తేలింది. వెంటనే జాబితాను సరిచేశారు. అంకెల్లో 650 చూపించినప్పటికీ అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది రావడంతో గందరగోళం తలెత్తింది. కాగా, ఈ ఏడాది నీట్ పరీక్ష వివాదాలకు కేంద్రంగా మారింది. ఆల్ ఇండియా టాపర్ విషయంలో ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్‌కు మార్కులు సమానంగా రావడంతో టై బ్రేకింగ్ పాలసీ ప్రకారం ప్రకటన చేయడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే.