ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులు అవస్థలు - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులు అవస్థలు

May 12, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారు. పరీక్షలు మొదలైన రోజు నుంచి నేటీవరకు ప్రశ్నా పత్రాల విషయంలో ఆందోళన చెందుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బుధవారం ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు ఇంటర్ బోర్డు ద్వారా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు ఇవ్వకుండా, చేతితో రాసిన క్వశ్చన్ పేపర్స్‌ను ఇచ్చారు. దాంతో విద్యార్థులు ప్రశ్నాలు అర్థంకాక సతమతమయ్యారు.

హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్ జిల్లాలో ఈ పరీక్షను ఫస్ట్ ఇయర్‌లో 32మంది, సెకండ్ ఇయర్‌లో 24 మంది విద్యార్థులు రాశారు. ఉదయం 8.30 గంటలకు క్వశ్చన్ పేపర్స్ బండిల్‌ను అధికారులు తెరిచారు. హిందీ మీడియం పేపర్లు లేకపోవడంతో ఇంగ్లీష్ మీడియం పేపర్లను ట్రాన్స్ లేటర్‌తో హిందీలో రాయించారు. దాన్ని జీరాక్స్ తీయించి, విద్యార్థులకు ఇచ్చారు. దాంతో విద్యార్థులకు చేతిరాత సరిగా అర్ధం కాకపోవడంతో సమయం వృథా అయిందని విద్యార్థులు ఆవేదన చెందారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ..”ఇలా చేతితో రాసి ఇస్తామని ఆయా ప్రిన్సిపాళ్లకు గత మార్చిలోనే సమాచారం ఇచ్చాం. ఆప్షనల్ సబ్జెక్టుల పేపర్లనూ ఇలానే ఇస్తాం” అని తెలిపారు.