మూడో కూటమిపై ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

మూడో కూటమిపై ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి : కేసీఆర్

March 4, 2022

15

జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటులో నిమగ్నమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అందులో భాగంగా శుక్రవారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి నేరుగా చేరుకున్న అనంతరం సోరేన్‌తో సమావేశమయ్యారు. మూడో కూటమి ఆవశ్యకత, ఆ దిశగా చేయాల్సిన తదుపరి చర్యల గురించి చర్చించారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా సరైన అభివృద్ధి జరగలేదు. అందుకోసం ఏం చేయాలనే దానిపైనే ప్రధానంగా చర్చించాం. ప్రత్యామ్నాయ కూటమిపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటా’మని వెల్లడించారు. అంతకుముందు సోరేన్ అధికారిక నివాసంలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను అందజేశారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన సరిహద్దు ఘర్షణలో మన రాష్ట్రానికి చెందిన సంతోష్ బాబుతో పాటు పలువురు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జవాన్లకు కేసీఆర్ ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు కానీ, సంతోష్ బాబుకు తప్ప మిగతా వారెవ్వరికీ నిధులు ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వని వారికి ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వారి కుటుంబాలకు చెక్కు రూపంలో ప్రకటించిన సహాయాన్ని అందజేస్తున్నారు.