పెళ్లికి పిలవలేదని రచ్చ రంభోలా.. వంటసామాన్లు విసిరేసి, కొట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి పిలవలేదని రచ్చ రంభోలా.. వంటసామాన్లు విసిరేసి, కొట్టి..

May 13, 2022

పక్కింట్లో పెళ్లి విందుకి ఊరందర్నీ పిలిచి, తమను మాత్రం పిలవకపోవడాన్ని పక్కింటి వ్యక్తులు సీరియస్‌గా తీసుకున్నారు ఆ వ్యక్తులు. తమ కడుపు మంటను, ఉక్రోషాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకొని, నేరుగా భోజనాల వద్దకు వెళ్లి రచ్చరచ్చ చేశారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్‌లోని నాకా చంద్రబద్ని ప్రాంతంలో కదం సింగ్ అనే వ్యక్తి.. తన కుమారుడు లోకేంద్ర వివాహ కార్యక్రమం సందర్భంగా మే 11న రిసెప్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు, సన్నిహితులను అందరినీ ఆహ్వానించాడు.

ఇరుగుపొరుగున ఉండే దిలీప్, సోను, ప్రమోద్, జితేంద్ర తదితరులను మాత్రం విస్మరించాడు. దీంతో వారు కడుపు మండి, కావాలనే అవమానించారని భావించి, ఎలాగైనా ఆ ప్రోగ్రామ్‌ను ఫ్లాప్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే పిలవని పేరంటానికి వెళ్లి, భోజనాలు వడ్డించే వద్ద అక్కడున్న సామాన్లను విసిరికొట్టారు. భోజన పదార్థాలను చెల్లాచెదురుగా పడేశారు. అంతటితో ఆగకుండా… పెళ్లికొడుకుని రథంపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు, మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.