సొంత పార్టీపై విమర్శలకు దిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలను ప్రారంభించింది. ఫోన్ ట్యాపింగ్, కాల్ రికార్డ్ విమర్శలపై గుర్రుగా ఉన్న నాయకత్వం అతనిని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ ఛార్జిగా తప్పించింది. కోటంరెడ్డి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. వచ్చే ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీంతో నెల్లూరు నగరంలోని ఆదాల నివాసం వద్ద వైసీపీ కార్యకర్తల సందడి నెలకొంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కోసం పలువురి నాయకుల పేర్లను పరిశీలించి చివరికి ఆదాల పేరును ఖరారు చేశారు.నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ ఛార్జిగా నియమించడం సంతోషమని..పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆదాల తెలిపారు.
కీలక సమావేశం
వైసీపీ పార్టీలో అసంతృప్తి, అంతర్యుద్ధాలపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారు. వెంటనే వీటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. 26 జిల్లాల పార్టీ కోర్డినేటర్లతో పాటు, మంత్రి బొత్స, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదాల తదితరులు హాజరయ్యారు. ఎన్నికలకు ముందే అంతర్గత కలహాలను చక్కదిద్దాలని సీఎం జగన్ పార్టీ శ్రేణలకు సూచించినట్టు సమాచారం.
నెల్లూరు రూరల్ సీట్ ఆదాలకే..
2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీచేస్తారని సజ్జల మీడియాకు తెలిపారు. ఆదాల పోటీపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇక అన్ని కార్యక్రమాలు ఆదాల ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.