మహిళా ఎస్సైతో వార్డు వాలంటీర్ దురుసు ప్రవర్తన ( వీడియో ) - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా ఎస్సైతో వార్డు వాలంటీర్ దురుసు ప్రవర్తన ( వీడియో )

July 8, 2020

bngvngv

నెల్లూరు జిల్లాలో ఓ వార్డు వాలంటీర్ వీరంగం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయాడు. అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తాగిన మత్తులో అతడు చేసిన హంగామా అంతా వీడియో తీయడంతో వైరల్ అయింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఐ కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. అయితే కేసు నమోదు చేసిన సీఐ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. వాలంటీర్ ఆగడాలపై స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఆత్మకూరులోని 21వ వార్డుకు చెందిన వాలంటీర్‌ అర్ధరాత్రి తాగి వస్తుండగా పోలీసులు తనిఖీలు చేశారు. ఎస్సై రోజాలత లాక్‌డౌన్ నిబంధనలు పాటించరా అంటూ వారిని ప్రశ్నించగా అతడు రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. నడిరోడ్డుపై చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. అతని చర్యలను అక్కడే ఉన్న పోలీసులు వీడియో తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఆ సమయంలో మరో వాలంటీర్ భర్త కూడా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం తరుపున బాధ్యతాయుతంగా పనులు చేయాల్సిన వాలంటీర్లు ఇలా చేయడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు.