వయసు 49.. ఎవరెస్టును 23 సార్లు ఎక్కాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

వయసు 49.. ఎవరెస్టును 23 సార్లు ఎక్కాడు..

May 15, 2019

ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో ఒక్కసారన్నా అధిరోహించాలని అనుకుంటారు. వారికి భిన్నంగా ఓ వ్యక్తి ఎవరెస్టును ఏకంగా 23 సార్లు ఎక్కి చరిత్ర సృష్టించాడు. నేపాల్‌లోని సొలుకుంబు దగ్గరలోని థేమ్‌ గ్రామానికి చెందిన కామి రిటా(49) అనే వ్యక్తి ఆ ఘనత సాధించాడు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎవరెస్టును ఇన్నిసార్లు ఎక్కిన ఏకైక వ్యక్తి కామి రిటా మాత్రమే. షెర్పా తెగకు చెందిన అతను ఈ పర్వతాన్ని మొదటి సారిగా 1994 మే 13న ఎక్కాడు. బుధవారం 23వ సారి దిగ్విజయంగా ఎవరెస్టును ఎక్కేశాడు.

సముద్రమట్టానికి 8848 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహిస్తూ వస్తున్నాడు రిటా. ప్రస్తుతం ఈయన సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ అనే సంస్థలో సీనియర్‌ గైడ్‌గా పనిచేస్తున్నాడు. 8000 మీటర్ల పైబడి ఎత్తున్న కే2, చో-ఒయు, లోస్తే, అన్నపూర్ణ వంటి అనేక ఎత్తైన పర్వతాలు కూడా ఎక్కిన ఘనత రిటాది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఈ పర్వతం ఎక్కాలనుకోవడం ఒక పెద్ద సాహసమే. రిటాకు ఆ సాహసం పదేపదే చేయడం పనిగా మారిపోయింది. షెర్పా తెగకు చెందిన వీరికి పర్వతాలు అధిరోహించడం వెన్నతో పెట్టిన విద్య. హిమాలయాల్లో పలు పర్వతాలు ఎక్కే సాహసయాత్రీకులకు వీరు గైడ్‌లుగా వ్యవహరిస్తారు.