కరోనా ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదని చెప్పడం పునరుక్తే. దానికి రాజు-పేద, బలిసిన-బక్కచిక్కిన భేదాలు ఉండవు కదా అని చాలామంది అమాయకంగా మొఖం పెట్టచ్చు. నిజమే.కానీ మనుషులందరినీ ఒకే పరిస్థితుల్లో, ఒకే రక్షణ కవచంలో ఉంచినప్పుడే అది వర్తిస్తుంది. లేకపోతే ఒక్కొక్కరి ప్రపంచం ఒక్కో తీరుగా నడుస్తుంది. ప్రజల గౌరవమర్యాదలు, హక్కులు వారి మతం, కులం, వర్గాన్ని బట్టి బహుముఖాలుగా విస్తరించి ఉంటాయి. అందరి బాధలు ఒక్క తీరుగ ఉండవు.
సినిమాకో, షాప్పింగుకో వెళ్లలేక పోవడం, కారులో తిరుగుతూ నెక్లెస్ రోడ్డులో ఐస్క్రీమ్ తినే సుఖానికి నోచుకోలేకపోవడం, జిమ్ముకు వెళ్లి కండలు కరిగించలేక పోవడం, వెకేషన్‌కి ఊటీకో, షిమ్లాకో పోలేకపోవడం, మానస సరోవరంలో మానసిక ఉల్లాసాన్ని పొందలేక పోవడం కొందరి బాధలు. రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఆగిపోవడం, నిర్మాణ రంగం నిలిచిపోవడం ఆయా రంగాల్లో ఉన్న దళారీలకు, బ్రోకర్లకు ఇబ్బందే మరి.
నెల జీతంతో బతికే వేతన జీవులది కూడా వేదనే. రెండు, మూడు నెలలు జీతం రాకపోయినా, ప్రాజెక్టులు ఆగిపోయి ఉద్యోగాలే ఊడినా, దాచుకున్న ఆ కొంచెం రూకల్ని పొదుపుగా వాడి కొన్ని నెలలు నెట్టుకొస్తారు. వర్క్ ఫ్రొం హోమ్ అవకాశమున్న భద్రజీవులు ఇంట్లో పిల్లల్ని, సంసారాన్ని, ఆఫీసు పనినీ సమన్వయం చేసుకోడానికి కిందా మీదా పడుతుంటారు. మరీ ముఖ్యంగా ఉద్యోగినులు, అస్తమానం ఇంట్లోనే ఉండిపోయే పిల్లల్ని, మొగుళ్ళనీ కొత్త కొత్త వంటలతో మేపలేక ఎక్కువ కష్టం పడుతుండవచ్చు.
ఏ ఏటికా ఏడు ప్రకృతిని అనుసరించి వచ్చే పంట దిగుబడిని ఈ సారి మార్కెట్లకు తరలించడం కష్టమైపోయి దిక్కు తోచక, ఎవర్ని తిట్టుకోవాలో తెలియక సతమతమై పోయే రైతు కష్టం ఒక తీరు. ఉన్న చోట పని లేక పోవడం, నెత్తి మీద నీడ లేకపోవడం, ఊరిలో రెక్కలు ఆడించలేని అవ్వా, అయ్యా.. ఇంకా రెక్కలు మొలవని పిల్లలను వదిలేసి కొన్ని వేల కిలోమీటర్ల దూరానికి వలస పోయిన కూలి కష్టం ఇంకో తీరు. అందరి కస్టాలూ ఒక్కటి కావు. ఈ తరతమ బేధాలు, కట్టుబాట్లు ఇలా ఉండబట్టి కొన్ని యుగాలుగా జరిగిపోతోంది కదా. ఐతే ఇప్పుడు అందరికి బతుకుల్లోకి కొత్త పురుగు వచ్చి పడింది. కరోనా ఒక్కొక్కరికి ఒక్కో సైజులో గీతాలు గీసింది. కొన్ని మినహాయింపులు ఉండచ్చు, కొన్ని మార్పులు కూడా ఉండొచ్చు. అయినా సరే, సీత కష్టం, పీత కష్టం ఒక్కటి కానే కావు. పీత కైనా, సీతకైనా అవి కష్టాలనీ, లేదా కట్టుబాట్లనీ తెలిసి కూడా ఉండవు. అందువల్ల అందరి పట్లా ఒక్కటే స్థాయిలో కరుణ చూపించడం కూడా కుదరదు.
కష్టాలకు కరిగిపోవడం, చలించి పోవడం అందరూ చేసేదే. ఐతే అది వారి స్థాయిని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ద మెరియం కాలేజియేట్ డిక్షనరీ జాలిని ఇలా నిర్వచిస్తుంది. ‘ఇతరుల కష్టాలకు సానుభూతితో కూడిన స్పృహను వారికి ఉపశమనం కలిగే విధంగా ప్రదర్శించడం’. జస్టిస్ విఆర్ కృష్ణ ఐయ్యర్ వేరే సందర్భంలో మాట్లాడుతూ.. ప్రతి వాజ్యం వెనుకా ఒక మానవ సంక్షోభం ఉంటుందని, అది చట్టబద్ధంగా ఆయా జీవితాల్లోని కష్ట సుఖాల అభివ్యక్తి అని అంటారు.
కోర్టులు ఇప్పటి సంక్షోభ సమయంలో అలాటి జాలిగుణంతో వ్యాజ్యాలను పరిష్కరించడం ఒక అవసరం. ఇలాంటి సమయంలోనే భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకు వలస కూలీలకు కాసింత ఆర్థిక సాయం చేయాలని కోరడం సరికాదనిపించింది. వాళ్ళకు ఎవరో ఒకరు విదిల్చే మెతుకులు దొరుకుతున్నాయి కదా అనే కారణం వల్ల ఆయన అలా అనుకున్నారు. దళారులే కష్టమే ఆయనకు ప్రధానంగా కనిపించింది. అది అయన జ్ఞానం. ఐతే ఇదే సమయంలో పక్కదేశం నేపాల్‌లోని సుప్రీం కోర్టు వలస కూలీల విషయంలో భిన్నంగా స్పందించింది.
వలసజీవుల కష్టం అన్ని దేశాల్లోనూ ఒకటేనేమో. రాచరిజాన్ని వదిలించుకుని ఇటీవలే ప్రజాస్వామ్యంలోకి ప్రవేశించిన నేపాల్‌లో ఆ కూలీల కుటుంబాలు పిల్లాజెల్లతో రోడ్లపైకి వచ్చేశాయి. రాజధాని ఖాట్మాoడూ నుంచి వందల మైళ్ళు నడుచుకుంటూ సొంత ఊర్లకు కదిలిపోయే దృశ్యాలు కొందరు సహృదయుల్ని కదిలించాయి. మనలాగానే అక్కడి ప్రభుత్వం కూడా మార్చి 24 న దేశవ్యాప్త లాక్ డౌన్ విధించి, తర్వాత దాన్ని ముందుకు జరుపుకుంటూ ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇంత సుదీర్ఘమైన లాక్‌డౌన్‌లో.. అది కూడా తలసరి ఆదాయం సంవత్సరానికి వెయ్యి డాలర్ల లోపే ఉన్న పేద దేశం తన ప్రజల కష్టాలను సహన శీలతతో అర్థం చేసుకోలేకపోయింది.
మన దేశంలోలా అక్కడి ప్రధానమంత్రి కూడా కోర్టు తన ఉత్తర్వు ఇచ్చే సమయంలోనే రాజధాని వెలుపల ఎలాంటి కదలికలూ కూడదంటూ హెచ్చరిక జారీ చేశాడు. అంతే కాకుండా కరోనా నుంచి కాపాడుకోవడం ఎలాగో చూపిస్తున్నట్టుగా వేన్నీళ్ళతో చేతులు కడుక్కోవాలనీ, సన్ గ్లాసెస్ పెట్టుకుంటే కళ్లకు ఇన్ఫెక్షన్ రాదంటూ కళ్లజోడు పెట్టుకుని మరీ చూపించాడు.
అతని ప్రభుత్వం కూలీల్లా ఖాళీ కడుపులతో, ఎండకూ, వానకూ వెరవక వందల కిలోమీటర్లు ఒళ్ళు బలిసి వాక్ చేయడం లేదనీ, తప్పని సరి పరిస్థితుల్లోనే కదిలిపోతున్నారని తెలిసో తెలియకో బెల్లం కొట్టిన రాయి వలే ఉండిపోయింది. ఇది చూసి కడుపుమండిన కొందరు లాయర్లు, పౌరులు సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఏప్రిల్ 17న జస్టిస్ ఆనంద మోహన భట్టారాయ్, సప్నా ప్రధాన్ మల్లాల ధర్మాసనం వలస జీవులపై కరుణతో, బాధ్యతతో ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు వివేకంతో స్పందించింది. కోవిడ్-19 మొత్తం ప్రజానికాన్ని ప్రభావితం చేసిన సంక్షోభంగా గుర్తిస్తూనే బీదాబీక్కి అరణ్య ఘోషను గుర్తించింది. గూడులేని వలస కూలీలు, వికలాంగులు, పిల్లలు, వృద్ధులు మహిళలు దారుణ వ్యథలు అనుభవిస్తున్నారని చెప్పింది. అందువల్ల న్యాయసూత్రాలు అందర్నీ ఒకే గాటన కట్టకూడదని, సందర్భాన్ని బట్టి, తులనాత్మక పరిశీలన చేయాలని వ్యాఖ్యానించింది.
కానీ ఇప్పుడు అమల్లో ఉన్నన్యాయసూత్రాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న చర్యలు చూస్తే పైపైన అది అన్ని సమూహాలనూ సమానంగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తుంది. తరచి చూస్తే మాత్రం కరోనా కరాళనృత్యం కింద అణగారిపోతున్న బతుకుల కనిపిస్తాయి. కోర్టు తన తీర్పులో ఇదే విచక్షణ చూపింది. కరోనా సహాయక చర్యల్లో సమానత్వ హక్కుకు భంగం కలుగుతోందని అంగీకరిస్తూ విచారణ కోసం వ్యాజ్యాన్ని స్వీకరించింది. ఎంతైనా కొత్త రాజ్యాంగం కదా. దాని స్ఫూర్తిని కాపాడాలని కోర్టు భావించినట్టు ఉంది. తన ఉత్తర్వులో వలస కూలీలు తమ ప్రాంతాలకు చేరుకోవడం వారి ఆత్మగౌరవానికి చెందిన అంశమని పేర్కొంది.
అన్నం పొట్లాల కోసం, కాసిన్ని సరుకుల కోసం ఎదురు చూసే ఒక మందలాగా భావించడం ఆధునిక సమాజానికి రాజ్యాంగ విలువలకు, అంతిమంగా మానవ విలువలకే విఘాతం. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారంటూ కనీసం కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, మానవ సమాజాన్ని కాపాడుతున్నట్టుగా ఫోజు పెడుతూ విచ్చల విడిగా లాఠీలు ఝుళిపించే పోలీసులు నిజానికి చేస్తున్నది ప్రజల గౌరవానికి భంగం కలిగించడమే. డాక్టర్లు, రోగులు, నిత్యావసరాల కోసం బయటకు వచ్చే ప్రజలు ఎవ్వరైనా సరే అందర్నీ విచక్షణా రహితంగా ఉన్మాదం నెత్తికెక్కినట్టుగా పోలీసులు వీరంగం చేస్తున్న దృశ్యాలు సమాజంలో తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. పైగా వీటికి రాజకీయ నాయకుల ప్రోత్సాహం దొరకడం ఇంకా ప్రమాదకరం. నేపాల్ ఉప ప్రధాన మంత్రి ఈశ్వర్ పొఖరెల్ ప్రభుత్వం బజారులో తిరిగే ప్రజల్ని కట్టడి చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తుందని హెచ్చరించాడు. మన దగ్గర ఇలాంటి సందర్భాలు, మహానుభావులు కోకొల్లలు. కానీ కోర్టులు కూడా రాజ్యానికి వంత పాడితే ప్రజలకు న్యాయం జరిగేదెలా?
ముహమ్మద్ బవాజిజి అనే ఒక టునీసియన్ చిరు వ్యాపారి ఉదంతం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రభుత్వం, దాని దళారీలు తన జీవనోపాధిని దెబ్బతీశాయని, అవమాన భారంతో ఆత్మాహుతి చేసుకున్నాడు. 2010 నాటి జరిగి అరబ్ స్ప్రింగ్ విప్లవాలకు అతని బలిదానం తక్షణ ఉత్ప్రేరకంగా పని చేసింది. ప్రభుత్వాలకు వణుకు పుట్టింది. ప్రజల మర్యాదకు భంగం కలిగించడం వ్యవస్థలకు మంచిది కాదనేందుకు ఇది ఒక ఉదాహరణ.
ఇప్పుడు మళ్లీ నేపాల్ కేసు విషయానికే వస్తే ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించకుండా లాక్‌డౌన్ ప్రకటించడం వాళ్ళ మర్యాదకు భంగమే. నేపాల్ కోర్టు తన తీర్పులో ఇదే విషయాన్ని తప్పుపడుతూ ప్రజలను వారి స్వస్థలాలకు పంపడానికి ప్రభుత్వం తన వద్ద వున్న అన్ని వనరుల్ని వినియోగించాలని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పారిపోకూడదని, రాజ్యాంగ విలువలను తూచ తప్పకుండా పాటించాలని మందలించింది.
తన ఆదేశాల వల్ల తలెత్తే కొన్ని ఇబ్బందులను కూడా కోర్టు ప్రస్తావించింది. ప్రభుత్వం వలస కూలీలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని, అన్ని జాగ్రత్తలు, కట్టడి నియమాలను పాటిస్తూనే వారిని తరలించొచ్చని చెప్పింది. వారికి పరీక్షలు చేసిన తర్వాత ఏ ప్రమాదం లేదని తేలితేనే ప్రయాణాలకు ఏర్పాట్లు చెయ్యాలని, ఇన్ఫెక్షన్ ఉన్న వారిని క్వారెంటైన్ చేయాలని సూచించింది. తరలింపులో మహిళలు, చిన్న పిల్లలు, వృద్దులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రయాణం విషయంలో డబ్ల్యుహెచ్వో మార్గదర్శకాలను పాటించాలని కూడా చెప్పింది. అంతే కాదు, లాక్‌డౌన్ సమయంలో ప్రజల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన కౌన్సెలింగ్ సెషన్లు కూడా నివహించాలని తెలిపింది.
ప్రభుత్వం స్థానిక వ్యవస్థలతో కలిసి ప్రజలకు అవసరమైన మందులు, నిత్యావసరాలు విధిగా అందించాలని, ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఇతర రంగాలైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో భాగం చేసేందుకు అవసరమైతే శిక్షణ, సబ్సిడీలను అందించాలని చెప్పింది. గ్రామాలకు తిరిగి వచ్చిన వారిని ఎలాంటి వివక్షా లేకుండా కలుపుకుపోవాలని సూచించింది. వారిని వైరస్ కారియర్లగా ఎంతమాత్రం చూడకూడదని చెప్పింది. వీటన్నిటిలో సాధక బాధకాలను ప్రభుత్వ పరిధిలోకే చేర్చుతూ తన పరిధిని అతిక్రమించకుండా కూడా చూసుకుంది. ప్రజల హక్కులను కాపాడటం మటుకే తన విధిగా ప్రకటించింది.
నేపాల్ సుప్రీం కోర్టు తీర్పు ప్రజలపై న్యాయ స్థానాలకు ఉండవలసిన భాద్యతను, ఎరుకను తెలియజేస్తుంది. పక్క దేశాల్లో రాజకీయాధినేతల వాగాడంబరాలు , న్యాయవ్యవస్థల ఉదాసీనతనూ అనుభవిస్తూ లాక్‌డౌన్‌లో కుంగిపోతున్న ప్రజల అవస్థలు ఇటువంటివే. ఆ దేశాల ప్రజల్ని న్యాయ వ్యవస్థలు పట్టించుకుంటాయో లేక ఉద్యమాలే పరిష్కరిస్తాయో చూడాలి.
(నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థి హార్దిక్ సుబేది ‘ది వైర్’ పత్రికలో రాసి వ్యాసానికి స్వేచ్ఛానువాదం)