Nepali watchman stole 55 lakhs in Kukatpally
mictv telugu

HYD : రూ. 55 లక్షల సొత్తుతో నేపాలీ వాచ్‌మెన్ పరారీ

July 13, 2022

హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీ దొంగతనం జరిగింది. వాచ్‌మెన్‌గా ఉన్న నేపాలీ వ్యక్తి అదును చూసి రూ. 55 లక్షల సొత్తుతో పరారయ్యాడు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీస్ స్టేషనుకి పరుగెత్తి ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావులు పరామర్శించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే.. స్థానిక వివేకానంద కాలనీలో నివాసముండే వడ్డేపల్లి దామోదరరావు ఇంట్లో నేపాల్‌కి చెందిన వ్యక్తి చక్రధర్ భార్య సీత మూడేళ్ల కుమారుడితో వాచ్‌మెన్‌గా చేరాడు. మొదట్లో ఎంతో నమ్మకంగా, నిబద్ధతతో పనిచేయడంతో దామోదర్ కుటుంబం వాచ్‌మెన్ చక్రధర్‌ని నమ్మింది. దాంతో అతడు స్వేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ నగలు, డబ్బు ఎక్కడ దాస్తారో రహస్యంగా తెలుసుకున్నాడు. డబ్బు, బంగారం చూసి ఆశ పుట్టిన చక్రధర్ చోరీ చేయడానికి తగిన అదును కోసం వేచి చూశాడు.

ఈ క్రమంలో యజమాని కుటుంబం ఈ నెల 12న మంగళవారం రోజు ఓ ఫంక్షనుకి వెళ్తారని తెలుసుకున్నాడు. దీంతో ఆ సమయంలోనే చోరీ చేయాలని భావించి అంతకుముందే ఈ నెల ఆరో తేదీన నాగ్‌పూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి భార్య, కుమారుడుని అక్కడే వదిలేసి వచ్చాడు. తిరిగొచ్చేటప్పుడు తన వెంట మరో వ్యక్తిని తెచ్చుకున్నాడు. మంగళవారం దామోదరరావు కొంపల్లిలోని ఫంక్షనుకి వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించి తలుపులు పగులగొట్టి రూ. 30 లక్షల నగదు, రూ. 25 లక్షల విలువైన బంగారం దోచుకొని ఆటోలో ఉడాయించాడు. ఫంక్షన్ నుంచి తిరిగొచ్చిన యజమాని చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ డీసీపీ నేపాలీ వ్యక్తి కోసం గాలించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ సందర్భంగా నేపాలీ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.