పొరుగునున్న నేపాల్ దేశానికి కొత్త ప్రధానిగా పుష్పకమల్ దహల్ ప్రచండ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ అనుకూల వాదిగా పేరు పొందిన ప్రచండ ప్రధాని కావడంతో సరిహద్దు సమస్యలపై కొంత సానుకూల నిర్ణయం వెలువడవచ్చనే అంచనాలు ఉన్నాయి. 32 ఏళ్లుగా పార్టీలో ప్రధాన వ్యక్తిగా ఉంటూ వస్తున్న ప్రచండ.. ఓ విషయంలో ఆసియా ఖండంలోనే ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన పేర లిఖించుకున్నారు. ఈ ఖండంలో అతి తక్కువ జీతం తీసుకుంటున్న ప్రధానిగా నిలిచారు. ఆ దేశ వార్తల ప్రకారం ప్రచండ జీతం 77,280 నేపాలీ రూపాయలు.
అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 48 వేలు. ఇందులోనే ఆయనకు రూ. 10 వేల భత్యం, రూ. 5 వేల మొబైల్ బిల్లు ఉన్నాయి. దీంతో పాటు రాజధాని ఖాట్మండూ నుంచి బయటికి వెళ్తే రోజుకు రూ. 3 వేలు భత్యం, జీతం కాకుండా కారు కోసం ప్రతీనెలా 306 లీటర్ల ఇంధనం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తారు. అయితే జీతం తక్కువగా ఉన్నా.. స్టాఫ్ విషయంలో మాత్రం భారీ మినహాయింపు ఉంది. 45 మంది సలహాదారులను నియమించుకునే అధికారంతో పాటు 35 మంది సిబ్బందిని నియమించుకోవచ్చు. ఫోటోగ్రాఫర్, డ్రైవర్, అకౌంటెంట్ వంటి పోస్టులు ఇందులో ఉంటాయి. వీరందరికీ ప్రభుత్వ ఖజానా నుంచే జీతం చెల్లిస్తారు. ఇక నేపాల్ ప్రధానికి కొత్తగా నిర్మించిన విశాలమైన 22 గదులతో కూడిన ఇల్లు, అందులో బంకర్ నిర్మాణం వంటి వసతులు ఉన్నాయి. యూకే ఆధారిత టాటా మోటార్స్ రూపొందించిన జాగ్వార్ వంటి ఆధునిక కార్లు అందుబాటులో ఉంటాయి. కాగా, నేపాల్ రాష్ట్రపతికి జీతంగా మన కరెన్సీలో ఒకటిన్నర లక్షలు, ఉప రాష్ట్రపతికి లక్ష రూపాయల జీతం ఉంటుంది. వీరి జీతం ప్రధాని కంటే ఎక్కువ కావడం గమనార్హం.