జయ మేనత్త ఇల్లు మాకే దక్కాలి - MicTv.in - Telugu News
mictv telugu

జయ మేనత్త ఇల్లు మాకే దక్కాలి

August 18, 2017

చెన్నైలోని జయలలిత విలాసవంతమైన పోయెస్ గార్డెన్ ఇంటిని స్మారక స్థలంగా మార్చి, అందులోకి ప్రజలను అనుమతించాలన్న తమిళనాడు ప్రభుత్వానికి చుక్కెదురయ్యేలా ఉంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆ ఇల్లు తమకే దక్కుతుందని జయ మేనకోడలు దీపా జయకుమార్, మేనల్లుడు దీపక్ గట్టిగా వాదిస్తున్నారు.అవసరమైతే దీనిపై కోర్టు గడప కూడా తొక్కుతామని హెచ్చరించారు. దీపక్ అయితే సీఎం పళనిస్వామికి లేఖ కూడా రాశారు.

‘‘జయ మా మేనత్త. ఆమె ఎలాంటి వీలునామా రాయలేదు. అయితే పోయెస్ గార్డెన్ను మొదట కొన్న మా అమ్మమ్మ సంధ్య వీలునామా ప్రకారం జయ ఆస్తులకు నేనే చట్టబద్ధ వారసుణ్ని. జయ ఆస్తులను స్మారకంగా మార్చడానికి మేం ఒప్పుకున్నా అందుకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం పూర్తి చేయాలి. నా అనుమతిని, నా సోదరి అనుమతిని తప్పక తీసుకోవాలి. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకోం’ అని హెచ్చరించారు.
అన్నాడీఎంకే పార్టీ పై పట్టుకోసం యత్నించి విఫలమైన దీప కొత్త పార్టీ పెట్టింది. తర్వాత శశికళ పోయెస్ గార్డెన్ పై పెత్తనం చలాయించి , అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జైలుకెళ్లింది. దీప గత నెల పోయెస్ గార్డెన్లోకి అడుగుపెట్టేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

24వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న పోయెస్ గార్డెన్ను మాయాబజార్ వంటి తెలుగు సినిమాల్లో నటించిన సంధ్య కొన్నారు. తర్వాత జయ దీనికి ఆధునిక హంగులు అద్దారు. దీని విలువ ప్రస్తుతం కోట్లలో ఉంటుందని అంచనా.