ఓటీటీ యాప్‌లలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్ – జులై మధ్య కాలంలో ఏకంగా 10 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఇందులో కెనడా, అమెరికా, యూరప్‌ల నుంచి అత్యధిక మంది ఉన్నారు. మార్కెట్లో ఇతర పోటీ కంపెనీలు మంచి కంటెంట్ అందించడం, ధరలు వంటివి కీలక పాత్ర పోషించాయని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇవికాక, కరోనా ప్రభావం తగ్గడంతో ఉద్యోగులు పనిలోకి, పిల్లలు స్కూళ్లకు వెళ్లడం వంటివి కూడా ప్రభావం చూపాయని విశ్లేషకులు తెలుపుతున్నారు. జులై చివరి నాటికి ఈ సంస్థ సబ్స్క్రైబర్ల 220 మిలియన్లుగా ఉండగా, మార్కెట్లో ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ చాలా ముందంజలో ఉంది. అయితే సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం పెరగడం గమనార్హం. ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో 8.6 శాతం వృద్ధితో వార్షికాదాయం 7.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా, 2011 తర్వాత తొలిసారి ఈ ఏప్రిల్‌లో సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గడంతో వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెట్టింది. కంపెనీ షేరు విలువ కూడా 60 శాతం పడిపోయింది. కానీ, అంచనా వేసిన దాని కంటే సబ్స్క్రైబర్ల తగ్గుదల తక్కువగా ఉండడంతో కంపెనీ షేరు మంగళవారం ఏడు శాతం పెరిగింది.