నెట్‌ఫ్లిక్స్‌పై ముదురిన వివాదం.. హిందూ దేవుళ్లను కించపరిచారంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

నెట్‌ఫ్లిక్స్‌పై ముదురిన వివాదం.. హిందూ దేవుళ్లను కించపరిచారంటూ..

June 29, 2020

Netflix

రోజురోజుకు ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై వివాదం ముదురుతోంది. దీంతో ట్విట‌ర్‌లో #BoycottNetflix ట్రెండ్ అవుతోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై హిందూత్వ‌వాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమాలో దేవుడి పేరు పెట్టుకున్న కృష్ణ అనే వ్య‌క్తి అనేక మంది అమ్మాయిలతో శారీర‌క సంబంధాలు పెట్టుకోవ‌డంపై అభ్యంత‌రాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆ సినిమాలో దేవ‌త పేరు పెట్టుకున్న‌ రాధ‌ను కూడా బాధితురాలిగా చూపించార‌ని మండిపడుతున్నారు. ఇలాంటి అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాల‌కు హిందూ దైవాల పేర్లు వినియోగించ‌డ‌మే కాక‌, హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచే వాటిని ప్రోత్స‌హిస్తుందంటూ నెట్‌ఫ్లిక్స్‌పై విముఖత వ్యక్తం అవుతోంది. 

‘మా డ‌బ్బుతో, మా విశ్వాసాల‌కు వ్య‌తిరేకంగా వెబ్‌సిరీస్‌లు తీసేందుకు నెట్‌ఫ్లిక్స్‌కు ఎంత ధైర్యం? ఒక మ‌నిషిని చంప‌డం కన్నా వారి న‌మ్మ‌కాన్ని చంప‌డ‌మే పెద్ద నేరం. దీన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించంబోం’ అంటూ నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. ‘ఇతర మతాల దేవుళ్ల పేర్లు పెట్టి ఇలా సినిమా తీసే ధైర్యం ఉందా’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇంత‌కుముందు వ‌చ్చిన లైలా, సాక్క్‌డ్ గేమ్స్‌, ఘౌల్‌, ఢిల్లీ క్రైమ్ వంటి ప‌లు వెబ్‌సిరీస్‌లు హిందూ వ్య‌తిరేక‌త‌ను ప్రోత్స‌హించాయి. ఇప్పుడొచ్చిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ కూడా హిందూ దేవుళ్ల‌ను కించ‌పరుస్తోంది’ అని మరింకొందరు నిప్పులు చెరిగారు. మరోవైపు ఈ వ్యవహారంపై  మీమ్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించగా, శ్రద్దా శ్రీనాథ్, సీరత్‌ కపూర్‌, షాలినీ వందికట్టి కథానాయికలుగా న‌టించారు.