మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక, గల్ఫ్ దేశాలు భారత రాయబార కార్యాలయానికి సమన్లు కూడా జారీ చేశాయి. చివరికి పాక్, తాలిబన్ పాలిత ఆఫ్ఘన్ దేశాలు కూడా ఆ వ్యాఖ్యలపై తమ విచారాన్ని వ్యక్తం చేశాయి. అయితే ఈ విషయంలో నుపుర్ శర్మకు అనూహ్యంగా విదేశాల నుంచి మద్ధతు లభించింది.
ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పు కాదు. నిజమే మాట్లాడిందంటూ నెదర్లాండ్ దేశ ఫ్రీడం పార్టీ ఎంపీ గీర్డ్ విల్డర్స్ మద్దతుగా నిలిచారు. అరబ్ దేశాల వైఖరిని ఆయన తప్పు పట్టారు. వాస్తవానికి నుపుర్ శర్మ ఒక్కరే ఈ విషయంపై నిజం మాట్లాడారని ఆమెను వెనకేసుకొచ్చారు. అంతేకాక, భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని అరబ్ దేశాలను ప్రశ్నించారు. ‘బుజ్జగింపు రాజకీయాలు అసలు పనిచేయవు. అవి పరిస్థితులను మరింత దిగజార్చుతాయి. భారతీయ మిత్రులారా, ఇస్లామిక్ దేశాలకు భయపడకండి. స్వేచ్ఛ కోసం పోరాడండి. గర్వించండి. మహమ్మద్ ప్రవక్త గురించి నిజాలు మాట్లాడిన నుపుర్ శర్మకు అండగా నిలబడండి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంతటితో ఆగక, అరబ్ దేశాల తీరును ఎండగట్టారు. ‘నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల పట్ల మీ వైఖరి హాస్యాస్పదంగా ఉంది. ఆమె నిజమే మాట్లాడింది కదా. భారత్ ఎందుకు సారీ చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వివాదం నేపథ్యంలో నుపుర్ శర్మకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆమె తనకు, తన కుటుంబానికి సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను కోరింది.