Netizens are angry with BCCI.. Is the selection of players correct?
mictv telugu

బీసీసీఐపై నెటిజన్స్ ఆగ్రహం..ఆటగాళ్ల ఎంపిక కరెక్టేనా?

September 13, 2022

టీ20 వరల్డ్ కప్ 2022కి సంబంధించి, భారత జట్టు ఇదేనంటూ సోమవారం బీసీసీఐ 15 మందితో కూడిన ఆటగాళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులోని ఆటగాళ్లు అక్టోబర్‌ నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆడబోతున్నారు. అయితే, బీసీసీఐ ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంపిక చేసిన జాబితా కరెక్టేనా? అంటూ బీసీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్‌లో ఏమాత్రం ప్రదర్శన చేయని ఆటగాళ్లను మళ్లీ టీ20 వరల్డ్ కప్‌కి ఎట్లా ఎంపిక చేశారు? అంటూ విమర్శలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. టీ20 భారత జట్టు విషయానికొస్తే.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), కోహ్లి, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆదీప్ సింగ్‌ను ఎంపిక చేయగా, స్టాండ్ బైలుగా..మహ్మద్ షమి, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, శ్రేయస్”ని బీసీసీఐ అధికారులు ఎంపిక చేశారు. అయితే, స్టాండ్ బైలను పరిశీలిస్తే కొంత ఆశ్చర్యం కలగక మానదు. కొన్నేళ్ల విరామం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ తనకు వచ్చిన అవకాశాలను పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. అతడి ప్రదర్శన సాధారణం. అయినా, అతను ప్రపంచకప్ జట్టులోకి ఎలా ఎంపికయ్యాడన్నది అర్ధం కాని విషయం. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ సైతం అంతగా రాణించింది లేదు. వీళ్లిద్దరితో పోలిస్తే రవి బిష్ణోయ్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఆసియా కప్‌లోను ఆడిన ఒక మ్యాచ్‌లో అతను రాణించాడు.

ఇక స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్, అనుభవజ్ఞుడైనా శ్రేయస్ అయ్యర్‌ను స్టాండ్‌పైగా ఎంపిక చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. దీపక్ హుడాను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. హుడా ఐర్లాండ్ లాంటి చిన్న జట్లపై మెరిశాడే తప్ప..కీలక మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు. ఆసియా కప్‌లోను విఫలమయ్యాడు. ఆల్ రౌండర్ కాబట్టి హుడాను ఎంచుకున్నారేమో అనుకుంటే, అతడికి బౌలింగే ఇవ్వట్లేదు. కేవలం బ్యాట్స్‌మనే కావాలనుకుంటే తనకంటే శ్రేయసే మెరుగు అంటున్నారు విశ్లేషకులు.

ఇక సీనియర్ పేసర్ మహ్మద్ షమి విషయానికొస్తే.. షమిపై పని భారం ఎక్కువ అవుతుందని, యువ పేసర్లకు అవకాశం ఇవ్వాలని ఇన్నాళ్లూ అతణ్ని పక్కన పెట్టినట్లుగా అనిపించింది. కానీ, ఇప్పుడు ఉన్నట్లుండి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌కు షమిని ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు స్టాండ్ పైగా పెట్టారు. షమిని ప్రపంచకప్‌లో ఆడించాలనుకుంటే ముందు నుంచి జట్టులోకి తీసుకోవాల్సింది. అప్పుడప్పుడూ మ్యాచ్‌లు ఆడించాల్సింది. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ షమి గొప్పగా బౌలింగ్ చేశాడు. మరి అలాంటి బౌలర్‌ను ఇన్నాళ్లూ పక్కన పెట్టి, ప్రపంచకప్ ముంగిట సిరీస్‌కు ఎంపిక చేయడం, టోర్నీకి స్టాండ్‌పైగా పెట్టడంలో వ్యూహమేంటో అని నెటిజన్స్ మండిపడుతున్నారు. సంజు శాంసనకు అవకాశం ఇవ్వకపోవడం, గాయం నుంచి కోలుకుని అందుబాటులోకి వచ్చిన దీపక్ చాహరకు సరైన అవకాశాలు ఇవ్వకుండా స్టాండ్ బైకు పరిమితం చేయడంపైనా క్రికెట్ అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.