విజయవాడ పోలీస్‌ సూపరెహే.. డ్యూటీ అంటే డ్యూటీనే  - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడ పోలీస్‌ సూపరెహే.. డ్యూటీ అంటే డ్యూటీనే 

September 26, 2020

విశ్రాంతి అన్నది లేకుండా నిరంతరాయంగా పనిచేస్తున్న పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్య కార్మికులకు మనం ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిదే. ఎండా, వానా, చలి, రాత్రి పగలు ఇలా ఏ తేడా లేకుండా 24 గంటలు వారు వృత్తిలోనే ఉంటారు. కరోనా సమయంలో వారి సేవలు మరింత పెరిగాయి. ప్రాణాలకు తెగించి మరీ వారు కరోనా పోరాటంలో అలసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేము ఉన్నామని సహృదయంతో ముందుకొచ్చి మన కష్టాలను తీరుస్తున్న వారి సేవలకు సలాం చేయాల్సిందే. ఏపీలో ఓ పోలీస్ కానిస్టేబుల్ చేసిన పనికి ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. వారి సేవ ముందు మనం తలవంచాల్సిందే అనిపిస్తుంది. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే.. విజయవాడలోని హనుమాన్ జంక్షన్ సర్కిల్ వద్ద నిత్యం ట్రాఫిక్ రద్దీ బాగా ఉండే విషయం తెలిసిందే. అక్కడ నిత్యం దేవిశెట్టి శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తుండగా భారీ వర్షం మొదలైంది. ఆ వర్షాన్ని చూసి ఆయన తన వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదు. 

గొడుగు తీసుకోవాలనో, వాన కాస్త తెరిపి ఇచ్చేవరకు షెడ్డు కిందకు వెళదామనో ఆయన అస్సలు భావించలేదు. వానలో చల్లగా తడిచిపోతూనే ఆయన తన విధి నిర్వర్తించారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన ఆయన ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. చలి, వానలను ఖాతరు చేయకుండా విధి నిర్వహణలో చిత్తశుద్ధి ప్రదర్శించిన దేవిశెట్టి శ్రీనివాస్ నిబద్ధతను ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆ కానిస్టేబుల్‌ను శాలువాతో సత్కరించారు. ఈ మేరకు కానిస్టేబుల్ ఫోటోను ట్విటర్‌లో పోస్టు పెట్టగా.. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా కానిస్టేబుల్ సేవలను అభినందించారు. కాగా, వర్షంలో ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న శ్రీనివాస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వానలో తడుస్తూ డ్యూటీ చేసిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.