ఆగ్రాలోని తాజ్ మహల్లో మూసి ఉన్న 22 గదుల తలుపులను తెరువాలని, పురాతన కాలం నాటి హిందూ విగ్రహాలు అందులో ఉన్నాయంటూ వచ్చిన పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు నిన్న మండిపడింది. జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి గల ధర్మాసనం పిటిషన్ వేసిన వ్యక్తులకు అక్షింతలు వేసింది. ఎలాంటి పరిశోధన చేయకుండా ఎలా పిటిషన్ వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాతా ఈ పిటిషన్పై అర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు స్పందించారు. పురాతన కాలం నాటి హిందూ విగ్రహాలు అందులో ఉన్నాయనేది నిజం కాదని, ఇవి తప్పుడు వాదనలని స్పష్టం చేశారు. తాజ్మహల్ బేస్మెంట్లో ఉన్న గదులను అధికారికంగా ‘సెల్స్’ అని పిలుస్తారని, వీటిని శాశ్వతంగా మూసివేయడం జరగదన్నారు. మరమ్మతు పనులో కోసం ఇటీవలే వాటిని తెరిచినట్టు తెలిపారు.
కొన్నేళ్లుగా అన్ని రికార్డులను పరిశీలిస్తున్నామని, అక్కడ ఎటువంటి విగ్రహాలు లేవని పేర్కొన్నారు. 3 నెలల కిందట జరిగిన తాజ్ మహల్ పునరుద్ధరణ పనులు జరిగాయని చెప్పిన ఓ సీనియర్ అధికారి.. ‘‘ఇప్పటి వరకు సమీక్షించిన వివిధ రికార్డులు, నివేదికల ప్రకారం తాజ్ మహల్ లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయనడానికి ఆధారం లేదని, అసలు ఆ ఆనవాళ్లు కూడా ఏమీ లేవని ’’ అన్నారు. సమాధి సముదాయంలోని వివిధ భాగాలలో 100 కంటే ఎక్కువ సెల్లు ఉన్నాయి.. భద్రత కారణాల వల్ల వాటిని మూసివేయడం జరిగిందన్నారు.