కొత్త రూ. 50 నోటు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతామని చెప్పిన నోటు ఇదేనని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ఖండించనూ లేదు. కొత్త రూ. 50 నోట్లను బ్యాంకులకు తరలించే సమయంలో ఎవరైనా ఫొటో తీసి లీక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఆకుపచ్చ, నీలి రంగులు కలసిన లేత రంగులో ఉన్న ఈ నోట్లపై 50 అనే సంఖ్య, ఇతర వివరాలు నలుపు రంగులో ఉన్నాయి. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంది. అమల్లోకి రానున్నది ఈ నోట్లే అయితే ఇప్పటికే చలామణిలో ఉన్న రూ. 50 నోట్లను ఏం చేస్తారు? అవి కూడా చలామణిలో ఉంటాయా? లేకపోతే గతంలో రూ. 500, రూ.1,000 నోట్లను మార్చుకున్నట్లు పాతవాటిని బ్యాంకుల్లో మార్చుకోవాల్సి ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు.
ఏదేమైనా రూ. 2000 నోట్లకు చిల్లర దొరక్క అల్లాడుతున్న ప్రజలకు కొత్త రూ. 50 నోటు వస్తే కాస్తంత ఊరట లభిస్తుందన్నది నిజం.
గత ఏడాది రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయడం తెలిసిందే. కొత్త రూ. 50, కొత్త రూ. 20 నోట్లను ప్రవేశపెడతామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది.