మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో శిశువుల మార్పిడి కలకలం రేపుతోంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. చెన్నూరు మండలం రొయ్యలపల్లికి చెందిన మమత, కుమురంభీం జిల్లాకు చెందిన పావని మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో పది నిమిషాల వ్యవధిలో డెలివరీ అయ్యారు. ఇద్దరి మహిళల్లో ఒకరికి మగబిడ్డ, మరొకరికి ఆడబిడ్డ పుట్టారు. ఆసుపత్రిలో ఇద్దరి మహిళలకు చెందిన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుండగా..ఆసుపత్రిలోని నర్సులు ఆడబిడ్డను ఇవ్వవలిసిన వారికి మగశిశువును అందజేశారు. కాసేపటికి తేరుకొని ఆడశిశువును ఇవ్వబోయి , మగశిశువుని ఇచ్చామని .. పొరపాటు జరిగిందని నచ్చజేప్పేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ శిశువుకు పావని కుటుంబ సభ్యులు ప్రాథమిక చికిత్స కూడా చేయించుకొని వచ్చారు. ఆసుపత్రి నచ్చజెప్పినా కూడా మగశిశువును ఇచ్చేందుకు నిరాకరించారు.
అయితే తమకు మగబిడ్డ పుట్టిందని చెప్పిన నర్సులు.. ఆడబిడ్డను ఇచ్చారని మమత కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. తమకు మగబిడ్డ పుట్టాడని పావని కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. దీంతో ఇరు కుటుంబాలు, నర్సులకు మద్య గొడవ జరిగింది. ఆపరేషన్ డాక్టర్ మాత్రం నర్సులు చేతికి పూర్తి వివరాలతో ఎవరి బిడ్డను వారికి అందజేయాలని చెప్పామని.. వారు తికమక పడడంతో ఈ గందరగోళం నెలకొందని అన్నారు. దీంతో హాస్పిటల్ ఇంచార్జీ హరిచంద్ర రెడ్డి పూర్తి నిర్ధారణ వచ్చేవరకూ పిల్లలను శిశుసంక్షేమశాఖకు అప్పగిస్తామని చెప్పారు. డీఎన్ఏ టెస్ట్ తోనే ఈ విషయంలో స్పష్టత రానుంది. దీనికి మరో 15 రోజులు సమయం పట్టనుంది.