రుతస్రావ వివక్షపై కొత్త రంగు కత్తి.. పీరియడ్ రెడ్..  - MicTv.in - Telugu News
mictv telugu

రుతస్రావ వివక్షపై కొత్త రంగు కత్తి.. పీరియడ్ రెడ్.. 

September 30, 2020

రుతస్రావంపై చాలా దేశాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ‘ఆ మూడు రోజులు’ అశుభమని నమ్మేవాళ్లకు ఈ రాకెట్ యుగంలోనూ ఏమాత్రం కొదవలేదు. ఇక రుతుస్రావం రక్తం కనిపిస్తే భయపడిపోయేవారికి లెక్కలేదు. పొరపాటున అది బయటపడితే దాన్ని దాచుకోడానికి మహిళలు పడే యాతన వర్ణనాతీతం. స్త్రీ శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలో భాగంగా విడుదలయ్యే ఆ రక్తంపై వివక్షను నిర్మూలించడానికి వర్ణ శాస్త్రవేత్తలు కొత్త రంగు తయారు చేశారు. 

అమెరికాకు చెందిన Pantone స్వీడన్‌కు చెందిన Intimina అనే కంపెనీలు ఈ వర్ణాన్ని తయారు చేశాయి. దీనికి ‘పీరియడ్ రెడ్’ అని పేరు పెట్టారు. రుతస్రావంపై నెలకొన్న వివక్షకు, అవగాహన లేమికి ఈ రంగు చెక్ పెడుతుందని, దీన్ని విరివిగా ప్రచారంలోకి తీసుకురావడం వల్ల రుతుస్రావ రక్తం కూడా మన రక్తంలో ఒక భాగమనే సంకేతం వెళ్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ‘ఇది ఒరిజినల్ కలర్. ప్రవాహానికి సంకేతం’ అని పేర్కొన్నారు. రుతుస్రావంపై వివక్ష వల్ల పేద దేశాల్లో అమ్మాయిలు చదువును మానేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి ధర్మంపై అవగాహన లేకపోవడమే దీనికి కారణమని, దీనిపై స్కూళ్లలో సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.