New Cong chief Mallikarjun Kharge's ‘emotional’ moment
mictv telugu

‘కార్మికుడి కొడుకు నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా’.. ఎమోషనల్ అయిన ఖర్గే

October 26, 2022

కాంగ్రెస్ పార్టీ 98వ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి బాధ్యతలను స్వీకరించారు ఖర్గే. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచినట్లు ధ్రువపత్రాన్ని ఖర్గేకు అందజేశారు పార్టీ ఎన్నికల కమిటీ ఇంఛార్జ్ మధుసూధన్ మిస్త్రీ. గతవారం జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌ పై మల్లికార్జున ఖర్గే గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా నేతలంతా ఖర్గేను అభినందించి.. శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. తాను చిత్తశుద్ధితో తన విధులను ఇంతకాలం నిర్వర్తించానని.. అదేవిధంగా ఖర్గే కూడా నిలుస్తారని పేర్కొన్నారు. అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ.. మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సర్టిఫికెట్ అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఖర్గే.. ఇది తనకు భావోద్వేగంతో కూడిన క్షణమని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్కు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రస్తుతం ఉన్న విద్వేషాన్ని, అబద్ధపు సంకెళ్లను కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది. 50ఏళ్ల లోపు నేతలకు 50 శాతం సీట్లు ఇవ్వాలన్న ఉదయ్పుర్ డిక్లరేషన్లోని ప్రతిపాదనను అమలు చేస్తాం’ అని ఖర్గే పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం.. ఈరోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజని.. పేర్కొన్నారు ఖర్గే. కాంగ్రెస్‌ పార్టీని రక్షించడమే మనందరి లక్ష్యం అని పేర్కొన్నారు. తన అనుభవంతో అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. అంతా కలిసి పార్టీని ఉన్నతస్ధాయికి తీసుకెళ్లాలని సూచించారు. రాత్రింబవళ్లు కష్టపడి పార్టీకోసం పనిచేస్తానని.. సోనియా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. “ఒక కార్మికుడి కొడుకు, సాధారణ కాంగ్రెస్ కార్యకర్త పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం అనేది.. ఊహించని పరిణామం” అని పేర్కొన్నారు.