Manchu Manoj : టాలీవుడ్ సినీ నటుడు మంచు మనోజ్ రీసెంట్గా మరోసారి ఓ ఇంటివాడయ్యాడు. దివంగత నేత భూమా నగిరెడ్డి రెండో కూతురు మౌనిక రెడ్డిని గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న మనోజ్ ఎట్టకేలకు పెద్దల సమ్మతంతో పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్‌గా మంచు మనోజ్ వివాహం జరిగింది. ప్రస్తుతం అత్తారింటికి వెళ్లిన నూతన వధూవరులు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మనోజ్‌కు, మౌనికకు ఇది రెండో పెళ్లన్న సంగతి అందరికి తెలిసిందే. మనోజ్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కొన్న విభేదాల కారణంగా మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. మౌనికకు మొదటి భర్త ద్వారా ఒక కొడుకు ఉన్నాడు. అయినా వీరి ప్రేమకు అవేమి అడ్డురాలేదని నిరూపించి తన మంచి మనసును చాటుకున్నాడు మనోజ్. శ్రీవారి దర్శనం చేసుకున్న మనోజ్ మీడియాతో మాట్లాడుతూ కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అని అంటారు, అది నిజమేనని అందుకు ఉదాహరణ తానేని తెలిపాడు.
తమ ప్రేమపెళ్లి గురించిన అనేక విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ” నాకు 12 ఏళ్లుగా మౌనికతో పరిచయం ఉంది. గత 4 ఏళ్లుగా ఇద్దరం ప్రేమించుకుంటున్నాము. అయితే ఈ నాలుగేళ్లు మా ప్రేమకు ఎన్నో వ్యతిరేకతలు ఎదురయ్యాయి, అయినా గట్టిగా నిలబడ్డాము. ఏది ఓడిపోయినా ప్రేమ ఓడిపోదు. మా విషయంలో ప్రేమ గెలిచింది, మమ్మల్ని గెలిపించింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. నాలుగేళ్లు మేమిద్దరం ఎన్నో బాధలు పడ్డాము. శివుడి ఆశీస్సులతో పెద్దల దీవెనలతో ముఖ్యంగా మా అక్క సపోర్ట్‌తో ఎట్టకేలకు ఒకటయ్యాము” అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు మనోజ్. అందరి ఆశీస్సులు ఉన్నంత వరకు మాకు ఏమీ కాదన్నాడు.
గత కొంత కాలంగా మూవీస్‌కు బ్రేక్ చెప్పిన మనోజ్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నాడు. అయితే ఏ మూవీ చేస్తున్నాడన్న అప్డేట్స్ ఏమీ లేవు. రాజకీయ ప్రవేశం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మనోజ్. తనకు ప్రజలకు సేవ చేయాలని ఉందని కానీ, రాజకీయాల ద్వారా కాదని తెలిపాడు. మౌనికకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే తనకు ఫుల్ సపోర్ట్ ఇస్తానన్నాడు.