New features coming in WhatsApp
mictv telugu

వాట్సాప్‌లో కొత్తగా రానున్న ఫీచర్లు.. అన్నీ అవసరమైనవే

September 1, 2022

New features coming in WhatsApp

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మెసేజింగ్ కోసం ఎక్కువగా వాట్సాప్‌ను వాడుతున్నారు. అలాగే యూజర్లకు ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందివ్వడంలో సంస్థ ఎప్పుడూ చురుకుగానే ఉంటుంది. ఈ క్రమంలో వాట్సాప్ మరిన్ని ఫీచర్లను వినియోగదారుల కోసం తీసుకురాబోతోంది. అవేంటో తెలుసుకుందాం.

1. ప్రొఫైల్ డిస్‌ప్లే : వాట్సాప్ గ్రూపులో ఎవరైనా మెసేజ్ పంపితే వారి నెంబరు మన కాంటాక్ట లిస్టులో సేవ్ అయి ఉంటే వారి పేరు కనిపిస్తుంది. లేకపోతే వారి నెంబరు మాత్రమే కనిపిస్తుంది. కానీ, కొత్తగా రాబోతున్న ఫీచర్‌లో మెసేజ్ పంపిన యూజర్ ప్రొఫైల్ పిక్ కనిపించేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని కంపెనీ వెల్లడించింది.

2. భాషలు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ : ఇప్పటివరకు మన దేశంలో వాట్సాప్ కేవలం ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంది. ఇక నుంచి ప్రాంతీయ భాషలను పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. దీని వల్ల వాట్సాప్ వాడకం సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో సెట్టింగ్స్‌లో మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఈ సదుపాయం కొంత మంది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇక నుంచి దీనిని అందరికీ అందుబాటులో తేవాలని కంపెనీ నిర్ణయించింది.

3. డిలీట్ మెసెజెస్ రికవరీ : ఇప్పటివరకు డిలీట్ చేసిన మెసేజులు, మీడియా ఫైల్స్ తిరిగి రికవరీ చేసుకునే సదుపాయం లేదు. ఇక నుంచి ఆ బాధలు తప్పనున్నాయి. మెసేజ్ డిలీట్ ఆప్షన్ ఉన్న చోటే అన్ ‌డు ఆప్షన్ కనపడేలా తగిన మార్పులు చేయనున్నారు. అయితే కేవలం డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ద్వారా డిలీట్ చేసిన మెసేజులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.

4. స్క్రీన్ షాట్ తీయడం : వాట్సాప్‌లో వ్యూవన్స్ ఫీచర్ ద్వారా పంపే ఫోటోలు, మీడియా ఫైల్స్ ఒకసారి చూసిన వెంటనే డిలీట్ కానున్నాయి. దాంతో సదరు ఫైల్‌కి సంబంధించిన డిజిటల్ రికార్డులు ఎదుటి వ్యక్తుల వద్ద ఉండవు. అలాగే కొంతమంది వాటిని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు. ఇక నుంచి ఈ ఇబ్బంది కూడా తొలగిపోనుంది. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్టు కంపెనీ వెల్లడించింది.

5. కమ్యూనిటీస్ : ఈ ఫీచర్ గురించి జుకర్ బర్గ్ ఏప్రిల్‌లో వెల్లడించారు. కానీ, ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. కానీ, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ పరిచయం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కమ్యూనిటీస్ ఫీచర్ పేరుతో వస్తున్న దీంట్లో కొత్తగా పది గ్రూపులను క్రియేట్ చేయవచ్చు. వీటిని సబ్ గ్రూపులుగా పిలుస్తారు. ఇందులో ఒకేసారి 512 మంది సభ్యులుగా చేరవచ్చు. సభ్యులు తమకు నచ్చిన గ్రూపులో చేరవచ్చు. గ్రూపులను డిసేబుల్, ఎనేబుల్ చేసుకునే సౌకర్యం అడ్మిన్‌కు ఉంటుంది. అలాగే గ్రూపు సభ్యుల ఫోన్ నెంబర్లు ఇతరులకు కనిపించకుండా గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.