ఉమ్రాన్‌ మాలిక్‌ కొత్త చరిత్ర - MicTv.in - Telugu News
mictv telugu

ఉమ్రాన్‌ మాలిక్‌ కొత్త చరిత్ర

April 28, 2022

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు నువ్వా – నేనా అంటూ పోటాపోటీగా జరుగుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడతారని ఊహించిన క్రికెట్ ప్రియులకు నిరాశలు ఎదురౌతున్నాయి. యువ ఆటగాళ్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ, రికార్డులు సృష్టిస్తున్నారు.  బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా యువ ఆటగాళ్లు కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు.

బుధవారం రాత్రి గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ నిప్పులు చెరిగాడు. ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. ఇందులో నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేసి, ఐపీఎల్‌లోనే తొలిసారి ఐదు వికెట్ల ఫీట్‌ సాధించాడు. ఉత్కంఠభరిత పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ ఓడినప్పటికి, తన ప్రదర్శనతో ఉమ్రాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ (4-0-25-5) తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ ప్రదర్శన నమోదు చేశాడు.

ఐపీఎల్‌లో ఐదు వికెట్ల ఫీట్‌ అందుకున్న ఐదో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. ఉమ్రాన్‌ కంటే ముందు అంకిత్‌ రాజ్‌పుత్‌(5/14 వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌, 2018), వరుణ్‌ చక్రవర్తి (5/20 వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, (2020), హర్షల్‌ పటేల్‌(5/27 వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌, 2021), అర్ష్‌దీప్‌ సింగ్‌(5/32 వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌, 2021) ఉన్నారు.

మరోపక్క ఐపీఎల్‌ చరిత్రలో ఒక బౌలర్‌ నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేయడం ఇది మూడోసారి. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్​ నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇంతకు ముందు లసిత్‌ మలింగ 2011లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో, సిద్దార్థ్‌ త్రివేది 2012లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో నలుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేశారు.