మీ చెప్పులు గాయపడ్డాయా? డాక్టర్ నస్సీరామ్ ఆస్పత్రికి తీసుకెళ్లండి..

అందరూ  పనిచేస్తారు. వినూత్నంగా చేయడమే ప్రత్యేకత. ఆకర్షణ, వైవిధ్యం వగైరా కలగలిస్తే సక్సెస్ అదంతట అదే నడుచుకుంటూ వస్తుంది. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న సృజనాత్మక ఫోటో గురించి చెప్పడానికి ఈ రెండు ముక్కలు. ఈ ఫొటోలోని చర్మకారుడు తన వెనుక కట్టుకున్న ఫ్లెక్సీ గురించి అందరూ ఆసక్తిగా చెప్పుకుంటున్నారు.

ఫ్లెక్సీలో ఏముందంటే…

‘గాయపడిన బూట్ల ఆస్పత్రి. డాక్టర్‌. నర్సీరామ్‌.

ఓపీడీ సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

భోజన విరామం: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆస్పత్రి తెరిచి ఉంటుంది

అన్ని రకాల బూట్లకు జర్మన్ టెక్నాలజీతో చికిత్స చేయబడును..

ఈ ఫొటో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాకు వాట్సాప్ లో వచ్చింది. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే ఆనంద్..  ఈ చర్మకారుడి వివరాలు తెలపాలని నెటిజన్లను కోరాడు. అతనితో కలసి పెట్టుబడి పెట్టి దుకాణం పెట్టాలని ఉందన్నాడు. దుకాణం, ఇతర అవసరమైన వస్తువులు లేకుండానే కేవలం ప్రచారాస్త్రంతోనే ఆకట్టుకుంటున్న ఇతనికి సాయం చేయాలని ఆనంద్ ఉద్దేశం. దీన్ని గమనించిన కొందరు డాక్టర్ నస్సీరాం హరియాణాలో జింద్ లో ఉంటున్నాడని, గతంలో పత్రికల్లో ఆయనపై కథనాలు వచ్చాయని వివరించారు.