New medical college for Sangareddy because of my struggle.. Jaggareddy
mictv telugu

నా  పోరాటం వల్లే సంగారెడ్డికి కొత్త మెడికల్ కాలేజీ.. జగ్గారెడ్డి

November 16, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా 8  ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆన్ లైన్ ద్వారా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం, వనపర్తి, మహబూబాబాద్, మంచిర్యాలలో ఆయా కాలేజీల్లోని క్లాసులను ప్రగతిభవన్ నుంచి వర్చవల్‌గా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అంతే కాదు సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు కూడా. మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే హోదాలో జగ్గారెడ్డి హాజరయ్యారు

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ..  తన పోరాటం ఫలితంగానే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిందని, అసెంబ్లీలో మెడికల్ కాలేజీ కోసం తాను పోరాడినట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 2013లోనే కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మెడికల్‌ కాలేజీపై ప్రత్తిపాదనలు పంపించడం జరిగిందని.. ఆ తర్వాత మెడికల్ కాలేజీ మంజూరు అయ్యింది.. కానీ, దానిని సిద్ధిపేటకి తరలించారని తెలిపారు జగ్గారెడ్డి. తర్వాత మెడికల్ కాలేజీ కోసం మూడేళ్లు పోరాటం చేశానని చెప్పారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని.. ఏదైమైనా తన మూడేళ్ల ఉద్యమం, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ఫలించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెప్పిన్నట్లే కేసీఆర్ డబ్బులు రిలీజ్‌ చేసి మెడికల్ కాలేజీ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. అందుకే సంగారెడ్డి ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కేసీఆర్‌, హరీష్‌రావుకి కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.