కొత్త వాహన చట్టంపై ఒక్కో రాష్టం వెనక్కి - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త వాహన చట్టంపై ఒక్కో రాష్టం వెనక్కి

September 12, 2019

Vehicles Act After Gujarat slashes traffic fines.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వాహన చట్టంపై ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్‌ జరిమానాలను తగ్గిస్తే రాష్ట్రాలే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ల బారి నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలోకి బీజేపీ పాలిత రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా వచ్చి చేరాయి. కేంద్రం కొత్త వాహన చట్టంపై పునరాలోచించకపోతే, తామే జరిమానాలు తగ్గిస్తామని ప్రకటించాయి. 

ప్రస్తుతం ఉన్న జరిమానాలు ప్రజలపై భారం పెంచుతున్నాయని అభిప్రాయపడ్డాయి. ఇవే కాకుండా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, ఢిల్లీ కూడా కొత్త వాహన చట్టాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కొత్త వాహన చట్టాన్ని తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. ఈ అంశమై మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్‌ రౌత్‌ మాట్లాడుతూ..’కేంద్రం తీసుకున్న ట్రాఫిక్‌ జరిమానాల విషయంపై పునరాలోచించుకోవాలి, జరిమానాలను తగ్గించాలి’ అన్నారు. గోవా రవాణా శాఖ మంత్రి మౌవిన్‌ గోదిహ్వో స్పందిస్తూ..’ఇప్పట్లో కొత్త వాహన చట్టం ప్రకారం జరిమానాలను అమలు పరిచేది లేదు. వచ్చే ఏడాది జనవరి నుంచి వీలైతే అమల్లోకి తెస్తాం’ అన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ట్రాఫిక్ నిబంధనలే కర్ణాటకలోనూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు.