కాకతీయ వర్సిటీ నేపథ్యంలో మూవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

కాకతీయ వర్సిటీ నేపథ్యంలో మూవీ..

May 30, 2022

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే, ముఖ్యంగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో సాగే సినిమా అంటే.. హైదరాబాద్ లేకపోతే విజయవాడ, విశాఖ కనిపించేది. ప్రస్తుతం ట్రెండ్ మారి కొత్త ప్రాంతాలు వెండితెరపైకి మెరుస్తున్నాయి. ‘జార్జిరెడ్డి’ మూవీ 50 ఏళ్ల కిందటి ఉస్మానియా యూనివర్సిటీని ఆ రోజులతో కళ్లకు కట్టింది. తాజాగా వరంగల్‌లోని కాకతీయ యూనిర్సిటీ నేపథ్యంలో మరో చిత్రం ముందుకొస్తోంది. అందరూ కొత్త నటీనటులతో సందడి చేయనుంది. గాయనీ గాయకులు కూడా కొత్తవాళ్లే కావడం మరో విశేషం. ఈ చిత్రంలో అటు గ్రామీణ తెలంగాణ, ఇటు వరంగల్ నగర తెలంగాణ యాసలు ఆలరించనున్నాయి.

కాకతీయ యూనివర్సిటీతోపాటు అందమైన వరంగల్ పల్లెటూరి వాతావరణంతో చిత్రం నిర్మాణమవుతోంది. ఎస్‌ఎస్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, మాటలు పాటలు మిట్టపల్లి సురేందర్ అందించారు. చోర్ బజార్, విరాటపర్వం, జార్జిరెడ్డి వంటి భారీ మూవీలకు సంగీతం అందించిన సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అమ్ము ఎంటర్టైన్మెంట్ పతాకంపై సత్య జగదీశ్ కోసూరు నిర్మిస్తున్న ఈ చిత్ర తారాగణం ఎంపిక కోసం మే 23 నుండి 24 తేదీ వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆడిషన్స్ జరిగాయి. డాక్టర్ విశ్వాస్ హీరోగా నటిస్తున్నారు. కెమెరామెన్‌గా పవన్ గుంటుకు, ఎడిటర్‌గా శ్రీవర పబ్లిసిటీ గణేష్ రత్నం వ్యవహరిస్తున్నారు.