అత్యాధునిక హంగులతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పనులపై ప్రభుత్వం యమ స్పీడుగా పావులు కదుపుతోంది. ఈ డిసెంబర్ నెల నుంచి భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు లోక్సభ సచివాలయం ప్రకటించింది. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనుల ప్రణాళికపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్నీ హంగులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణాన్ని 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు లోక్సభ సచివాలయం స్పష్టంచేసింది. కొత్త భవనంలో ప్రతి ఎంపీకి డిజిటల్ హంగులతో ప్రత్యేక కార్యాలయం ఉంటుందని స్పష్టంచేసింది. మరోపక్క భవన సముదాయంలో ఎంపీల లాంజ్, కాన్స్టిట్యూషన్ హాల్, డైనింగ్ ప్రదేశాలు, లైబ్రరీ, కమిటీ రూమ్లు, తగినంత పార్కింగ్ స్థలంతో ప్రతీ విషయంలో అన్నీ వసతులు ఉండేలా నిర్మించనున్నట్టు తెలిపింది.
నూతన భవనం నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ పార్లమెంట్ సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం ఉండదని వివరించింది. ప్రస్తుత భవనంలోనే అవి కొనసాగుతాయని.. కొత్త భవనం నిర్మాణం సమయంలో వాయు, శబ్ధ కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న భవనం బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అయితే ఈ భవనానికి కొన్ని మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. కాగా, త్రిభుజాకారంలో నిర్మించనున్న కొత్త భవనానికి మొత్తంగా 940 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ ప్రజా పర్యవేక్షణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈమేరకు నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి టాటాతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టును 861.90 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్లు టాటా పేర్కొంది. లార్సెన్ అండ్ టర్బో దాఖలు చేసిన 865 కంటే తక్కువ మొత్తం దాఖలు చేసి టాటా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దక్కించుకుంది.