New policy in AP..liquor shops are now private!
mictv telugu

ఏపీలో కొత్త విధానం..మద్యం దుకాణాలు ఇక ప్రైవేట్‌కే!

July 16, 2022

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ త్వరలోనే ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా మద్యం దుకాణాలను మళ్లీ ప్రైవేటు వ్యాపారులకే అప్పగించాలని మంతనాలు జరుపుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం నడిపిస్తున్న మద్యం దుకాణాలకు స్వస్తి పలకాలని, మూడు రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే, ఇక ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించిన ధరలకే మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఓ ఉన్నతాధికారి తెలిపిన సమాచారం ప్రకారం..” ప్రభుత్వం మరింత ఆదాయం రాబట్టుకోవటం కోసమే ఈ ప్రైవేటు వైపు మొగ్గు చూపుతుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.25 వేల కోట్ల విలువైన మద్యాన్ని అమ్మింది. తద్వారా దాదాపు రూ. 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కానీ, ప్రభుత్వం సంతృప్తి చెందట్లేదు, వాస్తవంగా మద్యం వ్యాపార పరిమాణం ఇంకా చాలా ఎక్కువగా ఉందని, దాన్ని సరిగ్గా రాబట్టలేకపోతున్నామనే భావన ఎక్సైజ్ వర్గాల్లో ఉంది. ప్రైవేటు వ్యాపారులకు దుకాణాల నిర్వహణను అప్పగిస్తే, వారు కమీషన్ సొమ్ము కోసం వివిధ మార్గాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రైవేటు వ్యాపారులు పూర్తిగా వృత్తి నైపుణ్యంతో వ్యాపారం చేస్తారు. బీర్ల చల్లదనం కోసం కూలర్లు, వినియోగదారులకు అవసరమైన ఇతర మౌలిక వసతులు, పర్మిట్ రూమ్ వంటివి ఏర్పాటు చేసుకోగలరు. వీటన్నింటి వల్ల విక్రయాలు బాగా పెరుగుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నెలకు రూ. 1,900 కోట్ల విలువైన మద్యం అమ్ముతున్నారు” అని వెల్లడించారు.

ఇక, మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తే, నెలకు కనీసం రూ.3 వేల కోట్ల విలువైన మద్యం అమ్మొచ్చని, దాని ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. మద్యం దుకాణాల్ని ప్రైవేటు వ్యాపారులకు అప్పగిస్తూ, విధానాన్ని ప్రకటిస్తే దరఖాస్తు రుసుము, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ఇప్పటికిప్పుడు రూ.వెయ్యి కోట్లకుపైగానే ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విధానం అమల్లోకి వస్తుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.