ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన

April 16, 2022

jagan

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కొత్త నిబంధన పెట్టింది. ఏ ప్రభుత్వ శాఖల్లోను లేని విధంగా రోజులో మూడుసార్లు హాజరు తప్పనిసరిగా చేస్తూ, కొత్త విధానాన్ని ఈరోజు నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఇటీవలే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్‌ను ఉద్యోగులు తమ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని, రోజూకు మూడుసార్లు హాజరు వేసుకోవాలని తెలిపింది.

ఇందుకోసం మూడు సమయాలను నిర్దేశించింది. ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు హాజరు అయ్యేలా నిర్ణయం తీసుకుంది. సొంత ఫోన్లు లేనివారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్‌ ఫోన్లను ఉపయోగించుకోవాలని సూచించింది.

మరోపక్క సచివాలయ ఉద్యోగులు 2019 అక్టోబరులో విధుల్లో చేరారు. అప్పటినుంచి ప్రొబేషన్ కొరకు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ 2021 అక్టోబరులో ఖరారు చేయాలి. కానీ, శాఖాపరమైన పరీక్షల్లో చాలా మంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశంతో 2022 జూన్‌లో అందరి ప్రొబేషన్‌ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారు.