అక్టోబర్‌లోనే కరోనా.. డిసెంబర్‌లో తొలికేసు అబద్ధం: క్రీడాకారులు - MicTv.in - Telugu News
mictv telugu

అక్టోబర్‌లోనే కరోనా.. డిసెంబర్‌లో తొలికేసు అబద్ధం: క్రీడాకారులు

May 18, 2020

gn vg n

కరోనా మహమ్మారి విషయంలో మొదటినుంచి చైనా స్పష్టత లేకుండా వ్యవహరించింది. కాకి లెక్కలు చెబుతూ ఇప్పుడు ప్రపంచాన్నే అతలాకుతలం చేసే స్థాయికి దిగజార్చింది. ఇది ముమ్మాటికీ చైనా తప్పిదమే అని ప్రపంచదేశాలు చైనా మీద దుమ్మెత్తిపోస్తున్నాయి.  వైరస్ వ్యాప్తిని దాచిందని.. ఆ వైరస్ వుహాన్‌లోని ఓ ప్రయోగశాలలో ఉద్భవించిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతకుమించిన దారుణమైన ఓ నిజాన్ని ప్రపంచ సైనిక క్రీడాకారులు వెల్లడించారు. చైనాలో డిసెంబరు చివరిలో వెలుగు చూసిన కరోనా జనవరిలో తీవ్రరూపం దాల్చిందని చైనా చెప్పుకొచ్చింది. అయితే, గతేడాది అక్టోబరులోనే అనేకమంది క్రీడాకారులు గుర్తు తెలియని వ్యాధితో బాధ పడ్డారని, అవి ఫ్లూ తరహా లక్షణాల్లాగా ఉన్నాయని పలువురు క్రీడాకారులు చెప్పారు. 

ఈ విషయమై జర్మనీ వాలీబాల్ క్రీడాకారిణి జాక్వెలిన్ బాక్ మాట్లాడుతూ.. ‘2019లో వుహాన్‌లో ప్రపంచ సైనిక క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడల్లో పాల్గొన్నవారిలో చాలామంది అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. మేమెప్పుడూ ఇంతలా తీవ్ర అనారోగ్యానికి గురికాలేదు. చైనా నుంచి వచ్చిన కొన్నిరోజులకే నా తండ్రికీ సోకింది’ అని చెప్పింది. మరో  లక్జెంబర్గ్ ట్రయాథ్లాన్ అథ్లెట్ ఒలివర్ జార్జెస్ మాట్లాడుతూ.. ‘వుహాన్‌లో తొలి కేసు నమోదైంది డిసెంబరులో అని చెబుతున్న‌టికీ, అక్టోబరులో అక్కడి వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. ఎందుకో మాకు అర్థం కాలేదు. స్థానికులు బయట తిరగొద్దని నాడు వుహాన్‌లో ఆంక్షలు ఉన్నట్టు చెప్పుకునేవారు. అంతేకాకుండా, వీధుల్లో రసాయనాలు చల్లడం చూశాం. విమానాశ్రయంలో థర్మల్ స్కానర్‌తో శరీర ఉష్ణోగ్రతలు తీసుకున్నారు. బయటి నుంచి ఆహారం తీసుకోవద్దని చెప్పడం కూడా మాకు అప్పట్లో విచిత్రంగా అనిపించింది. 

వుహాన్‌లో మేమున్న భవంతిలో చాలామంది ఫ్లూ లక్షణాలతో బాధపడడం చూశాను’ అని వెల్లడించారు. తనలోనూ, తన పార్టనర్‌లోనూ ఆ లక్షణాలు కనిపించాయని ఫ్రాన్స్‌కు చెందిన ఇలోడీ క్లౌవెల్ అనే పెంటాథాన్ అథ్లెట్ తెలిపింది. ఈ క్రీడాకారులందరూ తమ అనుభవాలను వెల్లడిస్తుంటే చైనాలో కరోనా వైరస్ అక్టోబరులోనే వ్యాప్తి చెందిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ప్రపంచదేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కాగా, చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు 47 లక్షల మందికి పైగా కరోనా సోకగా, 3.15 లక్షల మంది మృతిచెందారు. దీనికంతటికీ కారణం చైనాయేనని అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఇప్పటికే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.