అలర్ట్ : దేశంలో కొత్తగా ‘టొమాటో జ్వరం’.. లక్షణాలు ఇవీ - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్ : దేశంలో కొత్తగా ‘టొమాటో జ్వరం’.. లక్షణాలు ఇవీ

May 10, 2022

ఇప్పటికే కరోనా కొత్త కొత్త వేరియంట్లతో నానా ఆగచాట్లు పడుతున్న ప్రజలకు మరో కొత్త రోగం పుట్టుకొచ్చి కష్టాల పాలు చేస్తోంది. దేశంలో కొత్తగా ‘టొమాటో జ్వరం’ బయటపడింది. కేరళలోని కొల్లాం నగరంలో ఈ కొత్త జ్వరానికి సంబంధించి 82 కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకే ఈ వ్యాధి సోకుతుందని కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రభుత్వాసుపత్రులలో వస్తున్న కేసుల ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు. కొత్త రకం జ్వరం దెబ్బకు చిన్నపిల్లలు ఎక్కువగా ఉండే అంగన్ వాడీ సెంటర్లను ప్రభుత్వం మూసివేసింది. అయితే లక్షణాలు మాత్రం ప్రత్యేకంగా ఇవీ అని చెప్పలేకపోతున్నారు. చర్మంపై దుద్దర్లు వచ్చి ఎర్రని పొక్కులు రావడం, అవి పెరిగి పెద్దగా టమాటో సైజులో ఉండడంతో ఈ జ్వరానికి టమాటో జ్వరంగా నామకరణం చేశారు. అయితే కొన్ని అందుతున్న సమాచారం ప్రకారం బాధితుల్లో కొన్ని లక్షణాలను వైద్యులు గుర్తించగలిగారు. అధిక జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు, అలసట, శరీర నొప్పులతో పాటు చేతులు, మోకాళ్లపై పొక్కులు వస్తుంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ బాధితులకు కొన్ని సూచనలు చేసింది. నేరుగా వైద్యుడిని సంప్రదించడంతో పాటు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్ధాలను అందించాలి. స్నానం చేసిన తర్వాత గోరు వెచ్చని నీరు తాగించాలి. పరిశుభ్రంగా ఉండాలని ప్రభుత్వవం జాగ్రత్తలు చెప్తోంది.