అదే పింగళి ఎన్‌కౌంటర్.. గురే తప్పింది! ఏ విలువలకీ జర్నలిజం ప్రస్థానం? - MicTv.in - Telugu News
mictv telugu

అదే పింగళి ఎన్‌కౌంటర్.. గురే తప్పింది! ఏ విలువలకీ జర్నలిజం ప్రస్థానం?

January 11, 2022

0.0110

నేటి తెలుగు జర్నలిజంలో విలువలు లేవు అని వాపోతుంటాం. జర్నలిజం అంటే నిజాన్ని వెలికి తీసి, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేదని ఇప్పటికీ నమ్మే అమాయకులు మన మధ్య ఉన్నారు. అయితే సినిమా, రాజకీయాలు, ఆధ్యాత్మికం వంటి అనేక రంగాలు భ్రష్టుపట్టిపోయినట్టే జర్నలిజం కూడా పతనమైపోయి చాలా ఏళ్లే అయింది. ఇంటికొక జర్నలిస్టు తయారై, సర్వత్రా ఆవరించిన విలువల శూన్యంలోంచి ఏమీ ఆశించలేని పరిస్థితిలో ఇటీవల కొన్ని కొత్త గొంతులు అలజడి రేపుతున్నాయి. డేర్ అండ్ డ్యాషింగ్‌గా ముందుకు దూసుకొచ్చి జర్నలిజంలో కొత్త ఒరవొడిని ప్రారంభించాయి. అయితే వీటి వెనక ఏవో శక్తులు ఉండడం, ‘ఎవరో నడిపిస్తే నడస్తున్నాయ’నే అనుమానాలు రావడం, కొన్ని సందర్భాల్లో అవి నిజం కూడా కావడం… వెరసి మళ్లీ నిరాశే అలముకుంటోంది.

01

మొక్కవోని నిజాయితీ
తెలుగు జర్నలిజం సమీపగతంలో తాను నిజం అనుకున్నది నిర్భయంగా చాటి సెన్సేషనలిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది ‘ఎన్ కౌంటర్’ పత్రిక. దాన్ని ఒంటిచేత్తో నడిపిన పింగళి దరరథరామ్ హత్యకు గురయ్యారు. దశరథరామ్ తన పత్రికలో రాజకీయ నాయకులను, బడాబాబులను ఏకేసిన విధానం, వ్యక్తిగత జీవితాలపై దాడి, వాడిన భాష వంటివాటిపై ఎవరికైనా పేచీలు ఉండొచ్చుగాని, ఆయన నిజాయతీని, తలకిందుల వ్యవస్థపై ఆగ్రహాన్ని ఎవరూ శంకించలేరు. కేవలం సంచలనాల కోసమే ఆయన వార్తలు రాసిన దాఖలాలూ లేకపోలేదు. అవినీతి రాజకీయ పార్టీలకు, అక్రమాలకు వకాల్తా పుచ్చుకున్న పత్రికల నుంచి ప్రజల దృష్టిని, తన ప్రత్యామ్నాయ స్వరంపై మళ్లించడానికి ఆయన అలా చేసి ఉండొచ్చు.
దాడి… దాడి… దాడి..

02

మూడున్నర దశాబ్దాల కిందట దరశరథరామ్ చేసిన ప్రయత్నమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొందరు చేస్తున్నారు. పాతుకుపోయిన పత్రికలతో, టీవీ చానళ్లతో పాఠకులు, వీక్షకులు విసిగివేసారిన నేపథ్యంలో ఈ కొత్త గొంతులకు ఆదరణ లభించడం సహజమే. మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోని అవినీతి, అక్రమాలను, మరెన్నో సామాజిక అంశాలను ఈ గొంతులు బలంగా వినిపిస్తున్నాయి. ‘పెట్టుబడి’తో అంతగా పనిలేని సోషల్ మీడియా వేదికగా ఈ ప్రత్యామ్నాయ జర్నలిస్టులు రాజకీయ పార్టీలపై, అక్రమార్కులపై బలంగా దాడి చేస్తున్నారు. అన్యాయానికి గురైన బాధితులతో నేరుగా మాట్లాడ్డం, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, పోలీసులకు ‘దొరకని’ ఆధారాలను సేకరించి ససాక్ష్యంగా ప్రజల ముందు ఉంచడం, విషయంపై సునిశితమైన, ఘాటైన విమర్శలు, సమస్యకు పరిష్కారం దిశగా దారులు చూపడం వంటి చర్యలతో ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకులవరకు ఎవరినీ వీరు వదలడం లేదు. ఆయా నాయకుల వ్యవహారాలకే పరిమితం కాకుండా, వారి కుటుంబ సభ్యులను కూడా వీధికి లాగడం వీరికి అనివార్యమైపోయింది. వీరి దాడి సుడిగాలితో సమానం. అది అన్నింటినీ తనలో కలిపేసుకుని గమ్యం లేకుండా ఎక్కడెక్కడికో లాక్కెళ్లిపోయింది.
దారి తప్పిన ఎన్‌కౌంటర్లు..

03

అల్టర్నేటివ్ మీడియాగా అవతరించిన ఈ జర్నలిస్టులు నమ్మశక్యంకాని ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు. సమాచారం అందగానే ముందూవెనకా ఆలోచించకుండా వార్తలను, విశ్లేషణలను, విమర్శలను, దూషణలను కలగలిపి జనానికి అందిస్తున్నారు. అవినీతి, హత్య, బెదిరింపు.. విషయం ఏదైనా సరే, వెంటనే ప్రసారం చేస్తున్నారు. బాధితులు చెప్పిందే శిలాక్షరంగా భావించి, నిజానిజాలు నిర్ధారించుకోకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నుంచి వివరణ కోరకుండా.. తాము భావించినదే సత్యం అనుకుంటున్నారు. నిప్పులేనిదే పొగ రాదన్నది నిజమే అయినా అసలు ఆ నిప్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం కూడా ముఖ్యం. ఇరుపక్షాల వాదనలు తీరిగ్గా విని, సత్యాసత్యాలను నిర్ధారించుకునే ఓపిక ఈ జర్నలిస్టులకు ఉండడం లేదు. దీంతో సహజంగానే వీరు అందించే సమాచారం కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా, అసమగ్రంగా ఉంటోంది. ఫలితంగా వీరు విమర్శించే పార్టీల, నాయకుల అభిమానులు ఎదురుదాడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ తంతు కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అటు డేర్ డ్యాషింగ్ జర్నలిస్టులుగానీ, ఇటు వారిని తిట్టిపోసే పార్టీల అభిమానులు గాని ‘జర్నలిజం విలువ’లను పట్టించుకోకుండా ఆవేశకావేశాలకు లోనవుతున్నారు.
విమర్శంచిన రాజకీయాల్లోకే అరంగేంట్రం..

04

నిష్పాక్షిక జర్నలిజం అని, బాధితుల గొంతుకమని చెప్పుకుంటున్న ఈ సాహస జర్నలిస్టులు ‘కాలమహిమ’ వల్ల, తాము పీకల్లోతుగా ద్వేషించిన రాజకీయాల్లోకి ప్రవేశించడం మరింత నిరాశ, ఆందోళన కలిగించే పరిణామం. ‘స్వతంత్ర జర్నలిస్టు’గా మనుగడం సాగించడం నేటి పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టే వీరు కూడా అటు తిరిగి, ఇటు తిరిగి ఏదో ఒక పార్టీని ఆశ్రయించక తప్పడం లేదు. ప్రభుత్వాల వైఫల్యాలను, నాయకుల అక్రమాలను విమర్శిస్తూ సుదీర్ఘకాలం ‘ఇండిపెండెంట్ జర్నలిస్టుగా’ మనుగడం సాగించడం కష్టం. ఇంత చిన్న మీడియా అయినా దానికి కావలసిన సదుపాయాలు, ముఖ్యంగా జీవికకు అవసరమైన సంపాదన కోసం రాజీ పడక తప్పదు. ఈ జర్నలిస్టులు తమను నిత్యం విమర్శిస్తూ ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటే ప్రభుత్వాలూ చూస్తూ ఊరుకోవు. సామదానబేధదండోపాయాలు ప్రయోగిస్తాయి. పరువునష్టం కేసులు మొదలుకుని అక్రమ అరెస్టుల వరకు అణచివేతకు తెగిస్తాయి. ఎన్ని చేసిన ‘దారికి రానై’ జర్నలిస్టుల ‘వీక్ పాయింట్ల’పై చావు దెబ్బ కొడతాయి. ఫలితంగా సదరు జర్నలిస్టులు దాసోహం అనడమో, లేకపోతే విపక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి మళ్లీ ‘మెయిన్ స్ట్రీమ్’ మీడియా సరసన చేరడమో జరుగుతోంది.
ముందు ప్రస్తావించిన పింగళి దశరథరామ్ ‘ఎన్‌కౌంటర్’ విషయంలోకి మళ్లీ వద్దాం. ఆనాడు ఆయన ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తను చెప్పాల్సింది చెప్పి అలజడి రేపాడు. ఆయనకు వారసులుగా ముందుకొచ్చిన నేటి దరశరథరామ్‌లు ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నారా? లేదా? అన్నది కళ్లముందే కనిపిస్తోంది!

05

అన్యాయాన్ని ఎలుగెత్తి ప్రశ్నించడం, ఎవరికీ భయపడకుండా ప్రకటించడం దశరథరామ్ అనుసరించిన మార్గం. అందులో కష్టాలు, నష్టాలు ఉండొచ్చు. కానీ ఆయనను ప్రజలు ఆదరించారు. ‘మరీ ఓవర్’ అని విసుక్కున్నా ‘ఎన్‌కౌంటర్’ను హాట్ కేకుల్లా కొని ఆదరించారు. నేటి జర్నలిస్టులకు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఆ నిజాయతీ, నిర్భీతినే. మీడియా దశరథరామ్ కాలంతో పోల్చితే ఎంతో మారిపోయింది. ఆనాడు ఆయనకు అందుబాటులోని మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా మరెన్నో సాధనాలు ఈనాడు అందుబాటులో ఉన్నాయి. అవినీతి, అన్యాయాలను మరింత శక్తిమంతంగా, కళ్లకు కట్టినట్టు చూపించి ఎండగట్టే వనరులు, ఆదరించే కోట్ల జనం ఉన్నారు. నిష్పాక్షిక జర్నలిజం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు డేర్ డ్యాషింగ్ జర్నలిస్టులు ఆశాదీపికల్లా కనిపిస్తున్నారు. ఆ ఆశను నిరాశ చేయకుండా, జర్నలిజం విలువలను పాదుకొల్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. అది కష్టభరితమే కావొచ్చు. కానీ జనాదరణ తప్పక ఉంటుంది. ప్రజల పక్షాన నిలిచేర ‘అసలైన ఎన్‌కౌంటర్’ నేటి అవసరం.

06

07