తెలంగాణలో ఎన్నికలు మరెంతో దూరం లేకపోవడంతో ఆశావహులు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. ప్రధాన రాజకీయాలు కొన్ని పార్టీల చుట్టూనే తిరగాల్సిన అవసరం లేదని, ప్రత్యామ్నాలు చాలా ఉన్నాయంటూ వ్యూహాలు రచిస్తున్నారు. పాత పార్టీల్లోని అసంతృప్తులు కొత్త కుంపటి పెట్టుకోవడానికి, కొత్తవాళ్లు సొంత పార్టీ పెట్టుకోవడానికి ఎన్నికల సంఘం మెట్లు ఎక్కిదిగుతున్నారు. ఎన్నికలకు ముందు ఇది సహజమే. అయితే తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకం. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారడంతో ‘ప్రాంతీయ అస్తిత్వా’న్ని ఇక తమ భుజస్కంధాలపై వేసుకోవడానికి కొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికి మూడు…
పేరులో టీఆర్ఎస్‌ను, జెండాలో దాని రంగు గులాబీని ప్రతిబింబించేలా కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు కీలక నేతలు వీటి వెనక ఉన్నారని చెబుతున్నా వారి పేర్లు మాత్రం బయటికి రాలేదు. కొత్త ‘టీఆర్ఎస్’ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రాజ్యసమితి, తెలంగాణ రైతు సమితిల్లో ఏదో ఒకటి ఖరారయ్యే అవకాశముందని చెబుతున్నారు. మొదటి పదం తెలంగాణ, చివరి పదం సమితి, లేదా సమాఖ్య వంటి స పదాలతో ఉంటుందని, మధ్య పదం కోసం కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.