ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకుంటానన్న అరుణ్ పిళ్లై తెలిపారు. వాంగ్మూలం ఉపసంహరించుకుంటానంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిళ్లై పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. తాను కవితకు బినామీనంటూ ఈడీకి పిళ్లై వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 13 వరకు ఈడీ కస్టడీలో రామచంద్ర పిళ్లై ఉండనున్నారు. ఆ
అంతకుముందు అరుణ్ పిళ్లై కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు తెలిపారు. మార్చి 7 న ఆయన్ను అరెస్ట్ చేసి అదే రోజు ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. అరుణ్ పిళ్లై అరెస్టైన మరునాడే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఈడీ అధికారుల నోటీసులు ఇచ్చారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలున్నందున ఈ నెల 9వ తేదీన విచారణకు రాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు.ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరుకానున్నట్టుగా సమాచారం ఇచ్చారు. ఈ తరుణంలో అరుణ్ రామచంద్రపిళ్లై ఢీల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.