జగనన్న రూ. 75 వేల చేయూత ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

జగనన్న రూ. 75 వేల చేయూత ప్రారంభం

August 12, 2020

New welfare scheme started by andhra pradesh cm jagan

సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవ రత్నాలు పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ పథకాల ద్వారా కోట్ల ప్రజలకు లబ్ది చేకూరుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్సార్ చేయూత పేరుతో మరో పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. 

ఈ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..’మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించడానికి పీ అండ్ జీ, అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ వంటి సంస్ధలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కోళ్లు, పాడిపశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కిరాణా వ్యాపారం, చేనేత, వస్త్ర వ్యాపారం, తదితర లాభసాటి ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వమిచ్చే డబ్బును పెట్టుబడిగా ఉపయోగించుకోండి.’ అని తెలిపారు. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 4,700 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ డబ్బును నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు.