NEW YEAR RESOLUTIONS TO CHANGE LIFE
mictv telugu

కొత్త ఏడాదిలో ఇలా చేద్దామా…

January 5, 2023

NEW YEAR RESOLUTIONS TO CHANGE LIFE

కొత్త ఏడాది మొదలైంది. కొత్త సంకల్పాలు, కొత్త ప్రణాళికలు, లక్ష్యాలు అంటూ ఏవేవో పెట్టుకుంటాం. కానీ అక్కడితో ఆగిపోతే ఎలా. దానికి మనవంతు ప్రయత్నం కూడా ఉండాలి. ముఖ్యంగా విద్యార్ధులకు కష్టపడాలి. అనుకున్నది సాధించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి.

నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే వాటిని స్థిరంగా పాటించి సక్సెస్ అందుకుంటారు. దీనికి ఏమేమో చేసేయక్కర్లేదు. కొంచెం శ్రమిస్తే చాలు. బాగా చదువుకుని మార్కులు తెచ్చుకోవాలన్నా, కెరియర్ లో ముందుకు వెళ్ళాలన్నా ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అలవాట్లు:

ఏం చేయాలన్నా ముందు మార్చుకోవాల్సినవి మన అలవాట్లు. ఆరోగ్యకరమైన అలవాట్లును సాధన చేస్తే వాటివల్ల చాలా లాభాలు ఉంటాయి. దీనివలన చదువులో ఏకాగ్రత పెరగడమే కాదు రోజువారీ జీవితంలో ఒత్తిడినీ తగ్గిస్తుంది. సరైన సమయానికి పడుకోవడం, ఎర్లీగా లేవడం, ఎక్సర్సైజ్ చేయడం లాంటివి అవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్ ను తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తినాలి. ఇవన్నీ మనకు తెలియకుండానే మన మీద ప్రభావం చూపిస్తాయి. మన పనులు సక్రమంగా జరగడానికి తోడ్పడతాయి.

రోజురోజుకూ మార్పు ఉండాలి:

నిన్నటికి, ఇవాల్టికి తేడా ఉండాలి. ఆ తేడా మెరుగైన ప్రదర్శన దిశగా ప్రోత్సహించాలి. విజయం అనేది మన ఎండ్ పాయింట్ కాకూడదు, మన ప్రయాణం అవ్వాలి….అది ఏదైనా కూడా. బాగా చేసిన ప్రతీసారి ఇంకొంచెం బాగా చేయాలి అనుకోవాలి. ఇదే మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, సృజనాత్మకత, సామాజిక సేవ ఇలా ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించాలి. ఏమి చేసినా మన ఆసక్తికి అనుగుణంగానే ఎంచుకోవాలి.

నిద్ర:

నిద్ర….ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. నిద్రపోయే సమయం తక్కువ అయితే మొత్తం లైఫే దెబ్బ తింటుందని చాలా రిసెర్చ్ ల్లో తేలింది. నిద్ర తగ్గడం వలన మెదడు పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది. పనిలో ఆసక్తి తగ్గుతుంది. శారీరక ఆరోగ్యానికీ, మానసిక ఉల్లాసానికీ ఏ విధంగానూ మంచిది కాదు. అందుకే రోజుకు 7 లేదా 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. అలాగని ఎక్కువ నిద్ర పోవడం కూడా మంచిది కాదు.

అవగాహన:

కేవలం మనం చేస్తున్న పని మీదనే దృష్టి పెట్టి ఉండకూడదు. మన చుట్టూ ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.రోజుకు ఎన్నో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. ఏవేవో పరిశోధనలు జరగుతున్నాయి. వాటి మీద మనకు పట్టు వచ్చేయక్కర్లేదు కానీ వాటి గురించి తెలుసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. ఇది మన దృష్టిని విశాలం చేస్తుంది. ఆలోచనను, అవగాహనను పెంచుతుంది. దీనికోసం నలుగురితో మాట్లాడాలి, నాలుగు రకాలు చదవాలి.

వాయిదా:

ముందు దీనిని మానేయాలి. మనలో చాలా మందికి ప్రతీపనిని చివర వరకు వాయిదా వేయడం ఒక అలవాటుగా ఉంటుంది. దీనివల్ల టైమ్ వేస్ట్ అవుతుంది, దాంతో పాటూ పనులు పెండింగ్ ఉండిపోతుంటాయి. చివర నిమిషంలో చేయడం వలన చేసే పనిలో నాణ్యత కూడా తగ్గిపోతుంది. అందుకే దేనినైనా చేయాల్సిన టైమ్ లో చేసేయాలి. పెద్ద పనులు అయితే వాటిని చిన్న ప్రాజెక్టులుగా విభజించుకుని సమయానికి పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి.

కమ్యూనికేషన్:

ఈరోజుల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది కమ్యూనికేషన్. చదువుకునేప్పుడు కానీ, ఉద్యోగాల్లో కానీ ఇదే ముఖ్యపాత్ర పోషిస్తోంది. మనం మాట్లాడే తీరు, మన విషయ పరిజ్ఞానం ఇలాంటివే అవతలి వారిలో మంచి ఇంప్రెషన్ ను తీసుకువస్తాయి. సందర్భాన్ని బట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. అలాగే చక్కని భాషను ఉపయోగించడం కూడా నేర్చుకోవాలి. ఏ భాషలో మాట్లాడినా తడబడకుండా మాట్లాడడం రావాలి.

సమప్రాధాన్యం:

ఈ టైమ్, ఈ వయసు మళ్ళీ తిరిగి రావు. తెల్సుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. అది తరగతి గదిలో అయినా, జీవితంలో అయినా. అందుకే రెండింటి మధ్యా సమన్వయం ఉండాలి. స్నేహితులకు పెట్టే టైమ్ వల్ల మన ప్రదర్శన చెడిపోకూడదు. మార్కులు తగ్గిపోకూడదు. అలాగే చదువు, ఉద్యోగాల్లో పడి కుటుంబానికి ఇచ్చే సమయం తగ్గిపోకూడదు. ప్రతీదానికి నిర్దిష్టమైన ప్రణాళిక అంటూ ఉండాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. బ్యాలెన్సింగ్ చేయడం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన స్కిల్ ఈరోజుల్లో.