రెండున్నరేళ్ళు ప్రపంచం మొత్తాన్ని పీల్చి పిప్పి చేసింది కరోనా. ప్రతీ ఒక్కరూ ఎలా బతకాలిరా నాయనా అంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కాలం వెళ్ళదీశారు. ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడి మామూలుగా అవుతున్నారు. బయటకు వచ్చి తమ పనులు తాము చేసుకుంటున్నారు. కానీ ఇంకా ఆ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు న్యూయార్క్ శాసత్రవేత్తలు చేసిన మరో రీసెర్చ్ ఇంకొంచెం భయపెడుతోంది. కోవిడ్ మనల్ని వదిలిపెట్టలేదన్న చేదు నిజాన్ని బయటపెట్టారు సైంటిస్టులు.
ఎం బయో – అమెరికన్ ఫర్ మైక్రోబయాలజీ ఓపెన్-యాక్సెస్ జర్నల్లో విడుదల చేసిన ఓ అధ్యయనం కలకలం రేపుతోంది. ఇందులో న్యూయార్క్ లోని ఎలుకల్లో మూడు కోవిడ్ వేరియంట్లు ఉన్నాయని అక్కడి శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. న్యూయార్క్ నగరంలో ఎలుకల జనాభా 8 మిలియన్లు ఉన్నట్లు అంచనా. కరోనా సోకిన అడవి ఎలుకలు, మనుషులతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాయని అధ్యయనంలో రాసుకొచ్చారు. ఈ ఎలుకల ద్వారా మళ్ళీ కోవిడ్ మనకు సోకే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇది 1347-1351లలో యూరోప్ ను కుదిపేసిన బ్లాక్ డెత్ లాంటి కల్లోలంగా మారొచ్చని అలెర్ట్ చేస్తున్నారు.
మామూలుగానే అసలు కోవిడ్ వైరస్ ఎలుకల నుంచి వచ్చిందని ఓ రూమర్ ఉంది. చైనా ల్యాబ్ లలో ఎలుకల మీద ప్రయోగించిన వైరస్సే మనుషులకు సోకిందని అన్నారు. ఇప్పడు మళ్ళీ అదే ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు. కానీ మరో వైపు జంతువుల నుండి మనిషికి కోవిడ్ సంక్రమించడం చాలా అరుదు అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంటోంది.
అధ్యయనం అయితే జరిగింది అందులో ఈ నిజాలు బయటపడ్డాయి కానీ దానిని ధృవీకరించడానికి మాత్రం ఇంకా చాలాపరిశోధనలు జరగాలని అంటున్నారు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ హెన్రీ వాన్. దీనికోసం పరీక్షలు నిర్వహించాలని చెబుతున్నారు. కరోనా వైరస్ జంతువులలో తిరుగుతోంది, అది మానవులకు ప్రమాదం కలిగించే కొత్త జాతులుగా పరిణామం చెందుతుందో లేదో నిర్ధారించడానికి తాము ఇంకా పరిశోధనలు చేస్తున్నామని డాక్టర్ హెన్రీ వాన్ చెప్పారు.
న్యూయార్క్ లోని బ్రూక్లిన్ పార్కులు, అక్కడి మురుగునీరు ప్రవహించే ప్రదేశాల్లో ఉండే ఎలుకలను సేకరించి ఈ పరిశోధనలు చేశారు. 79 ఎలుకల నమూనాలపై నిర్వహించిన వైరోలాజికల్ స్టడీస్ జెనోమిక్ సీక్వెన్సింగ్ ఆధారంగా ఈ అధ్యయనం జరిగిందని పరిశోధకులు తెలిపారు.79 ఎలుకలలో 13 కి కోవిడ్ పాజిటివ్ ఉంది.
మా పరిశోధనల్లో కోవిడ్ పూర్తిగా చచ్చిపోలేదని తెలిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. మానవులకు, జంతువులకు దగ్గరి సంబంధాలున్నాయి. అవి ఒకరి మీద ఒకరికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలిసింది. కోవిడ్ విషయంలో జంతువుల పాత్ర ఉందనే విషయం మరో సారి మా రీసెర్చ్ రుజువు చేసిందని అంటున్నారు. దీనివలన మనుషులు జంతువుల నుంచి మరింత జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలిసిందని చెబుతున్నారు.